టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్
అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్
విద్యార్థి దశ నుంచే ఉద్యమబాట
పుట్టిన ప్రాంతంపై పూర్తి అవగాహన
సమస్యల పరిష్కారంలో చొరవ
ఉమ్మడి జిల్లా చరిత్రలో యాదవులకు టికెట్ దక్కడం ఇదే ప్రథమం
సర్వత్రా హర్షం
కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైంది. బుధవారం సీఎం కేసీఆర్ ప్రకటన చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమైంది. శ్రీనివాస్‌ది వీణవంక మండలం హిమ్మత్ నగర్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు 1983, ఆగస్టు 21న జన్మించారు. వీణవంకలో ఇంటర్ చదివిన ఆయన, హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన, బీఏ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకాలంలో వందకుపైగా కేసులు నమోదు కాగా, అనేక సార్లు జైలుకు వెళ్లారు. అయినా ఏనాడూ భయపడకుండా ముందుకు సాగారు. 2001 నుంచి నేటి వరకు నిబద్ధతతో టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. మచ్చలేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంపై మంచి పట్టున్న ఆయన, ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అలాగే నలుగురిని కలుపుకపోయే, పది మందికి మేలు చేసే గుణంతో అన్నా అంటే అండగా నిలబడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే టికెట్ కేటాయించారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా చరిత్రలో యాదవబిడ్డకు గౌరవం..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా యాదవ బిడ్డకు టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. నిజానికి ఉమ్మడి జిల్లాలో వారి జనాభా సుమారు 15 నుంచి 20 శాతం ఉన్నా.. ఇన్నాళ్లూ వారిని ఓటు బ్యాంకుగానే వాడుకున్నారే తప్ప.. ఏనాడూ వారికి ప్రాతినిధ్యం కల్పించలేదు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్.. గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందిం చారు. ఆ మేరకు సబ్సిడీపై గొర్రెలను ఇస్తున్నారు. ఒక నాడు పాలేర్లుగా ఉన్న ఎంతో మంది నేడు యజమానులుగా మారారు ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు టికెట్ ఇచ్చి మరింత చేయూతనిచ్చినట్లయింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నియోజకవర్గంలో సంబురాలు..
టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేయడంపై నియోజకవర్గంలో సంబురాలు చేసుకున్నారు. యాదవులతోపాటు విద్యార్థి, పలు సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అటు యువనేత కావడంతో యువకులు ఉత్సాహంగా ఉన్నారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గొల్ల, కుర్మల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. అన్ని మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకుంటామని ప్రకటించారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.