పైసా ఖర్చులేకుండా 57 రకాల టెస్టులు
ఆరు నెలలో 14.72 కోట్ల విలువైన టెస్టులు
45 రోజుల నుంచి కొవిడ్ ప్రొఫైల్ పరీక్షలు
శాంపిల్ ఇచ్చిన గంటల్లోనే మొబైల్ ఫోన్ లేదా మెయిల్‌కు రిపోర్టులు
పేద, మధ్యతరగతి ప్రజలకు తప్పిన ఖర్చులు
కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ): జ్వరం, దగ్గు మరేదైనా ప్రైవేట్ హాస్పిటల్ మెట్లెక్కాలంటేనే పేదలకు వణుకు. అవసరం లేకున్నా టెస్టులు.. పదిరకాల పరీక్షలు.. అడ్డగోలు వసూళ్లు.. ఓపీ, మెడిసిన్ ఫీజు కన్నా వీటి ఖర్చుకే భయపడాల్సిన పరిస్థితి. భారమైనా తప్పని దయనీయ స్థితి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికభారం. అయినా విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చేది. కానీ, సర్కారు దవాఖాన మెట్లెక్కితే చాలు భరోసా దొరుకుతున్నది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రభుత్వం, పైసా ఖర్చు లేకుండా మెరుగైన సేవలందిస్తున్నది. కోట్లాది రూపాయలతో జిల్లాకో టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, 57 రకాల టెస్టులు ఫ్రీగా చేస్తున్నది. సాధారణ రక్త, మూత్ర పరీక్షలతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, షుగర్, బీపీ.. ఇలాంటి ఎన్నో పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. శాంపిల్ ఇచ్చిన గంటల్లోనే మొబైల్ ఫోన్ లేదా ఈ మెయిల్‌కు రిపోర్టులు వస్తుండగా, పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్‌లో ప్రారంభించిన రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రంలో బయో కెమిస్ట్రీ, పాథలాజికల్, మైక్రో బయోలజీకి సంబంధించిన ప్రస్తుతం 47 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. బయోకెమిస్ట్రీ టెస్టుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఉన్న పుల్లీ ఆటోమేటెడ్ మిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో కెమికల్ బయో కెమిస్ట్రీకి సంబంధించిన రక్త, మూత్ర పరీక్షల్లో ఏఎల్పీ, బీయూఎం, ఎల్డీఎల్, ఎఫ్బీఎస్, జీజీటీ, జీటీటీ, ఎల్‌హెచ్, ఎల్ఎప్టీ, లిపెర్ ఫ్రొఫైల్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్ (ర్యాండం బ్లడ్ షుగర్), ఆర్ఎఫ్టీ, సీరం టోటల్, సీరం కెంబిల్ రూబిన్ డైరెక్ట్, సీరం హెడీఎల్, సీరం కొలెస్ట్రాల్, టోటల్ ప్రొటీన్, యూరిక్ ఆసిడ్, ఎలక్ట్రో వైడ్స్, ఎస్జీఓటీ, ఎస్‌జీపీటీ వంటి అనేక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హార్మోన్లకు సంబంధించిన టీ-3, టీ-4, టీఎస్‌హెచ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల హార్మోన్లు, థైరాయిడ్ పరీక్షలు ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఇక పాథలాజికల్ విభాగంలో రక్త కణాలకు సంబంధించిన ప్లేట్ లెట్స్, తెల్ల, ఎర్ర రక్త కణాలను పరీక్షిస్తున్నారు. సీబీపీ, ఏఈసీ, కూంబ్స్ టెస్టు డైరెక్ట్, ఇన్ డైరెక్ట్, డీఎల్సీ, ఈఎస్ఆర్, పీసీవీ, టీఎల్సీ వంటి అన్ని రక్త కణాలకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. ఫాథలాజికల్ విభాగంలోని అన్ని రకాల మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలిసా రీడర్స్ మైక్రో బయోలజీ విభాగంలో సైన్‌ఫ్లూ, చికెన్ గున్యా టెస్టులతోపాటు ఏఎస్ఓ, సీఆర్పీ, ఆర్ఎఫ్, ఆర్పీఆర్, టైడీ ఐజీఎం, ఐజీజీ వంటి పరీక్షలు చేస్తున్నారు. ఇక గుండె సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలూ నిర్వహిస్తున్నారు. అలాగే 45 రోజులుగా కొవిడ్ ఫ్రొఫైల్ పరీక్షలైన డిడైమర్, పెరిటిన్, ఏడీహెచ్, సీఆర్పీ, సీబీపీ క్రియాటిక్ వంటివి కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ పరీక్షల కోసం ఇప్పటి వరకు హైదరాబాద్ ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇపుడు ఇక్కడే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో పేద ప్రజలకు ఎప్పటికపుడు రిపోర్టులు ఇస్తున్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్‌లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు జిల్లాకో టీ- డయాగ్నోసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఉచితంగా 57 రకాల పరీక్షలు చేస్తున్నది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కరీంనగర్లో జనవరి 5 నుంచి ట్రయల్ రన్ సాగుతుండగా, ఈ నెల 9 వరకు 14.72కోట్ల విలువైన 1,98,544 పరీక్షలు చేశారు. జగిత్యాలలో 40లక్షల విలువైన 8469, రాజన్న సిరిసిల్లలో 40.20లక్షల విలువైన 10,558 టెస్టులు చేశారు. ఆయాచోట్ల పైసా ఖర్చు లేకుండా టెస్టులు చేస్తుండడంతో, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లలో రెండు నెలల్లోనే పది వేల పరీక్షలు..
జిల్లాలోని డయాగ్నో సెంటర్ పేద ప్రజలకు ఊరటనిస్తున్నది. 1.50 కోట్ల వ్యయం.. అత్యాధునిక యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభం కాగా, అఫీషియల్‌గా మాత్రం జూన్‌లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. జిల్లాలోని 13 ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా దవాఖాన పరిధిలోని రోగులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కేంద్రాలకు వైద్యం కోసం వచ్చే వారి నుంచి రక్త, మూత్ర పరీక్షలు సేకరించి సిరిసిల్లలోని టీ హబ్‌కు సంబంధిత వైద్యులు పంపిస్తారు. ఇక్కడ పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. వీటిని రాష్ట్ర స్థాయిలో ఉన్న బయో కెమిస్ట్రీ, పాథలాజిస్టు, మైక్రో బయోలజిస్ట్లైన వైద్య నిపుణులు పరిశీలించి తిరిగి స్థానిక నిర్ధారణ పరీక్షల కేంద్రానికి నివేదిస్తున్నారు. ఈ నివేదికలు సంబంధిత రోగుల మొబైల్ ఫోన్లకు కూడా అటాచ్ చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, దవాఖానల పరిధిలో క్లినికల్ బయో కెమిస్ట్రీ 7119, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథలాజీ 2801, క్లినికల్ మోక్రో బయోలాజీ 668 పరీక్షలు ఇలా మొత్తంగా 10,558 పరీక్షలు నిర్వహించారు. ఆరు నెలల వ్యవధిలోనే 40.20లక్షల విలువైన రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో నిరుపేదలకు ఆదా అయినట్లేనని వైద్యులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంటర్ వ్యాధి నిర్ధారణలో దూసుకెళ్తున్నది. రూ.2 కోట్ల వ్యయం.. అత్యాధునిక యంత్ర పరికరాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రం పరిధిలో 27 కేంద్రాలు (స్పోక్) కలిపి హబ్‌గా ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాలోని 16 పీహెచ్‌సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలోని మూడు ప్రభుత్వ దవాఖానలు, ఎంసీహెచ్, మరొక వెల్నెస్ సెంటర్‌కు సంబంధించిన రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. గత జనవరి 6న ప్రారంభించారు. అంతకు ముందు నిర్వహించిన ట్రయల్ రన్‌లోనే 6,960 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి పేద ప్రజలకు సుమారు 25 లక్షలు ఆదా చేశారు. ఈ నెల 9 వరకు మొత్తంగా 49,071 మందికి సంబంధించిన 1,98,544 శాంపిల్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో రాష్ట్రంలోని 19 టీహబ్‌లలో జిల్లా రెండో స్థానంలో నిలుస్తున్నది. కాగా, ఒక రోగికి వ్యాధి నిర్ధారణ కోసం అన్ని రకాల పరీక్షలు నిర్వహించినట్లయితే 5,300 దాకా ఖర్చువుతున్నది. అయితే అందరికీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం లేనందున సగటున ఒక్కొక్కరికీ 3 వేల చొప్పున లెక్కగట్టినా గడిచిన ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14.72 కోట్ల విలువైన పరీక్షలు నిర్వహించింది. ఇంత పెద్ద మొత్తంలో నిరుపేదలకు ఆదా అయినట్లేనని వైద్యులు చెబుతున్నారు.
ప్రతి రోజు 600 శాంపిల్స్ పరీక్షిస్తున్నాం..
ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 600పైగా శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నాం. ఇప్పటికే సుమారు 50 వేల మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ద్వారా లక్షకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కేవలం ఆరు నెలల్లోనే ఇన్ని పరీక్షలు చేయగలిగాం. బయటి ల్యాబుల్లో చేసినట్లయితే వీటి విలువ 14 కోట్ల దాకా ఉంటుంది. అంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఇలాంటి సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
కేటీఆర్ చొరవతోనే..
సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుంది. ప్రతి రోగానికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరమే. జిల్లాలో ఎక్కువ శాతం కార్మిక కుటుంబాలే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో షుగర్ వ్యాధి, కరోనాతో వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు తప్పని సరి చేయాల్సి ఉంది. ఈ పరీక్షలు ప్రైవేటులో అయితే పేదలకు ఆర్థిక భారం అవుతుంది. పేదలకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్న మంత్రి కేటీఆర్ ఆలోచన హర్షణీయం. జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం పేదలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకు మంత్రికి కృతజ్ఞతలు. విస్తరిస్తున్న పట్టణంలో మరికొన్ని బస్తీ దవఖానలతో పాటు ఏరియా దవాఖానలో సిటీస్కాన్, ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం.