ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
నాలుగు కేంద్రాల్లో వంద శాతం నమోదు
100 శాతం ఓట్లేసిన మహిళా ప్రతినిధులు
ఓటు హక్కు ను వినియోగించుకున్న మంత్రులు
సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్లో గంగుల, జగిత్యాలలో కొప్పుల, ఎంపీ వెంకటేశ్ నేతకాని lఓటు వేయని బీజేపీ ఎంపీ బండి పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు
కరీంనగర్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించగా, 99.70 శాతం పోలింగ్ నమోదైంది. 1,324 ఓట్లు ఉండగా 1,320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు కేటీఆర్ సిరిసిల్లలో, గంగుల కమలాకర్ కరీంనగర్లో, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని జగిత్యాలలో, ఆయా చోట్ల ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కాగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఓటు హక్కు లేకుండా పోయింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు మొదలైనా మధ్యాహ్నం 12 గంటల వరకు మందకొడిగానే సాగాయి. ఆ తర్వాత ఓట్లు వేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. పోలింగ్ సరళిని ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు విడుదల చేశా రు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కరీంనగర్ జడ్పీ, పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాల్లోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, టీ భానుప్రసాద్‌రావు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు.
ఓటు వేయని ‘బండి’
ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో సిరిసిల్లలో మంత్రి కేటీ రామారావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బీ వెంకటేశ్ నేతకాని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్లలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లిలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఓటు హక్కు లేదు.
స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్స్‌లు
సాయంత్రం ఎన్నికలు ముగియగానే అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి బాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లను కరీంనగర్ సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు.