స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వడంలో మతలబేంటి?
ఆ పార్టీ అధ్యక్షుడు ఈటలనా? బండా?
తల తెగి పడ్డ టీఆర్ఎస్ నేతలు క్రాస్ ఓటింగ్ చేయరు
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, డిసెంబర్10 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం తధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. తలతెగిపడ్డా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ చేయరని స్పష్టం చేశారు. తమకు పార్టీ అధినేత కేసీఆర్ క్రమశిక్షణ నేర్పించారని చెప్పారు. 1,324 ఓటర్లలో సుమారు వెయ్యి మంది టీఆర్ఎస్ వారే ఉన్నారన్నారు. ఇద్దరు అభ్యర్థులకు చెరి సమానంగా పడతాయన్నారు. గెలిచే సత్తాలేకే కాంగ్రెస్, బీజేపీలు పత్తాలేకుండా పారిపోయాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ యా? ఈటలనా? అర్థంకాని పరిస్థితి ఉన్నదన్నారు. ఎవరివైపు ఎంతమంది స్థానిక సంస్థల ప్ర తినిధులు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బండి సంజయ్ ప్రకటించగా.. స్వతంత్ర అభ్యర్థి సర్ధార్ రవీందర్‌సింగ్‌కు ఓటేయాలని ఈటల చెప్పడంలో మతలబెంటో అర్థంకావడం లేదన్నారు. ఆ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కొందరు కుట్రలకు తెరలేపారని విమర్శించారు.
పచ్చని టీఆర్ఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేందుకే కొందరు నామినేషన్లు వేశారని దుయ్యబట్టారు. ఇందులో ఒకరు స్వతంత్ర అభ్యర్థినని ఓసారి.. మరోసారి తనను బీజేపీ బలపరిచిందని చెప్పుకుంటూ కొత్తనాటకానికి తెరతీశాడని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్కు ఎన్నికలు కొత్తకాదని, ఏ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. ఈ ఎన్నికలతో తమ ఐకమత్యమేంటో నిరూపితమవుతుందన్నారు. కారు గుర్తుపై గెలిచిన వారంతా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేశారని స్పష్టంచేశారు. బీజేపీకీ కరీంనగర్ కార్పొరేషన్లో 13 మంది కార్పొరేటర్లతోపాటు మొత్తం 14ఓట్లు ఉన్నాయని, కానీ వారు రవీందర్‌సింగ్‌కు ఓటేశారా? లేదా? అనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఓట్లు తగ్గితే ఈటల బాధ్యత వహిస్తాడా? లేదా బండి సంజయ్ తీసుకుంటాడా? చెప్పాలన్నారు. టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు చేయలేదని, మా వాళ్లను మేము కాపాడుకునే ప్రయత్నంలో అది ఒక భాగమని స్పష్టం చేశారు. ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ప్రత్యర్థుల మొహంలో ప్రేతకళ కనిపిస్తోందని నిష్ఠూరమాడారు. మంత్రి వెంట మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఉన్నారు.