హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్10: డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 10 రోజుల పాటు క్యాంప్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రానికి రాగా స్రీనింగ్ చేసి కేంద్రంలోకి పంపించారు. 180 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్‌కుమార్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక, తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావుతో పాటు 60 మంది కౌన్సిలర్లు, హన్మకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఓటును వినియోగించుకొన్నారు. నియోజకవర్గంలోని శంకరపట్నం, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంటకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తమ ఓటు హకు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. వైద్య సేవల కోసం కరీంనగర్ డీటీసీవో డాక్టర్ రవీందర్, చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఈ రమాదేవి, సిబ్బంది కొవిడ్-19, హెల్త్ డెస్క్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు, మాసులు అందుబాటులో ఉంచారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి స్రీనింగ్ చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. హుజూరాబాద్ పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇద్దరి సహాయంతో వచ్చి ఓటు వేశారు. ఎన్నికల్లో 180 ఓట్లకు గానూ 180 పోలయ్యాయి. వంద శాతం పోలింగ్ నమోదు కాగా ఇందులో 97 మంది మహిళలు, 83 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లకు సీలు వేశారు. వీటిని హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో భారీ భద్రత నడుమ ఎన్నికల అధికారులు ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ రాంరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి పోలీసు సిబ్బంది తరలించారు.
ఓటేసిన తిమ్మాపూర్ సభ్యులు
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్10: సంస్థాగత ఎన్నికల్లో తిమ్మాపూర్ మండల సభ్యులు పాల్గొని ఓటు వేశారు. క్యాంపు నుంచి నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి, పుప్పాల కనకయ్య, ముప్పిడి సంపత్‌రెడ్డి, కొమురయ్య, వేల్పుల మమత, కవ్వంపల్లి పద్మ, పాశం తిలక్ప్రియ, కిన్నెర సుజాత తదితరులు పాల్గొన్నారు.