తెలంగాణచౌక్, డిసెంబర్ 10: కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైస్ మిల్లుల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వెంటనే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో సీఐటీయూ అనుబంధ రైస్‌మిల్లు ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముకుందరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగా, కేంద్ర సంస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగాలను తొలగిస్తున్నదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రెండు నాలుకల ధోరణితో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించడం లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 360 రైస్ మిల్లులు ఉండగా, 6 వేల మంది ఆపరేటర్లు, హమాలీలు, కార్మికులు, గుమస్తాలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, రైతుల పోరాటాల ఫలితంగానే కేంద్రం నూతన రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు భద్రయ్య, రమేశ్, నర్సయ్య, కొమురయ్య, రవి, రాజు పాల్గొన్నారు.