సర్వేక్షణ్ పోటీలో బల్దియాను ఉత్తమంగా నిలిపేందుకు బల్దియా కసరత్తు
34 అంశాల్లో మరింత మెరుగైన సేవలందేలా చర్యలు
కార్పొరేషన్, డిసెంబర్ 10: కరీంనగర్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీలో అత్యధిక మార్కులు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముఖ్యంగా 34 అంశాల వారీగా మార్కులు కేటాయిస్తుండగా, వాటిలో మరింత మెరుగైన సేవలందించే దిశగా కసరత్తు చేస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 34 అంశాలకు 1,990 మార్కులు కేటాయించారు. ఇందులో పారిశుధ్య సిబ్బంది పనితీరు, 15 శాతం ఇండ్లల్లో కంపోస్టు ఎరువు కేంద్రాల ఏర్పాటు చేస్తే 150 మార్కులు, పార్కు స్థలాలు, విద్యా సంస్థల్లో కంపోస్టు ఎరువు కేంద్రాలు ఏర్పాటు చేస్తే 80 మార్కులు కేటాయిస్తారు. అలాగే, పారిశుధ్య సిబ్బందికి రక్షణ సామగ్రికి 60 మార్కులు, సీనియర్ సిటిజన్స్, ప్రజలను పరిశుభ్రతలో భాగస్వాములను చేస్తే 160 మార్కులు, ప్రాంతాల వారీగా పొడి చెత్తను తగ్గిస్తే 50, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు, స్వశక్తి, ఇతర సంఘాలను భాగస్వాములను చేస్తే 100కు పైగా మార్కులు ఇస్తారు. స్వచ్ఛ యాప్, ఆయా బల్దియా యాప్‌లలో వచ్చే సమస్యలను తక్షణం పరిష్కరిస్తే 400, కొత్త మార్పులకు శ్రీకారం చుట్టి పరిశుభ్రతను మెరుగుపరిస్తే 220 మార్కులు, ప్రతి వంద మీటర్ల దూరంలో చెత్త లిఫ్ట్ బిన్స్ ఏర్పాటు, కాల్ సెంటర్లు, ప్రజా సమస్యలను పరిష్కరిస్తే 200కు పైగా మార్కులు కేటాయిస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కొవిడ్ టీకా వేయించడం, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి తక్షణమే స్పందించేలా మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇస్తే 220 మార్కులు, సఫాయిమిత్ర కార్యక్రమాలకు 85 మార్కులు ఇస్తారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్లకు వివరాలు అందించగా, స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో నగరాన్ని ఉత్తమంగా నిలిపేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.