కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లు కొనే విషయంలో బీజేపీ నాయకుల మాటల్లో స్పష్టత లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాసంగి వడ్లు కొనలేమని అంటున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి మాత్రం వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నాడని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కొంటరా.. కొనరా.. అనే విషయం వారికే క్లారిటీ లేదని, పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు, రైతాంగం గమనించాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని శ్వేత హోటల్లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. కేంద్రం యాసంగి వడ్లను కొనే దాకా టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన వారితో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 12న జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో ధర్నా చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు అన్ని పార్టీలతోపాటు బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నామని, తెలంగాణ రైతుల పక్షాన బీజేపీ కూడా తమ ఆందోళనల్లో పాల్లొనవచ్చని స్పష్టం చేశారు.
వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే..
రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అది రాజ్యాంగ పరమైన హక్కు అని స్పష్టం చేశారు. ధాన్యాన్ని నిల్వ చేసే సైంటిఫిక్ గోదాములన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. రైతులు సాగు చేసేందుకు అవసరమైన నీళ్లు, కరెంట్, పెట్టుబడి తదితర వనరులు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, ఇలాంటి సదుపాయాలను రైతులకు తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిందన్నారు. తెలంగాణలో జాలు పొలాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తారని వివరించారు. గతంలో లెవీ విధానం ఉన్నపుడు వడ్లు పండించమని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అర్థించేదని, ఈ కారణంగానే మన రైతులు వానకాలం, యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేసేందుకు అలవాటు పడ్డారని చెప్పారు. వానకాలం పంటపై ఉష్ణోగ్రత ప్రభావం లేకపోవడం వల్ల వడ్లను నేరుగా బియ్యంగా మార్చుకునే వెసులుబాటు ఉందని, ఎఫ్‌సీఐ చేసిన ఔట్ టర్న్ నిబంధనల మేరకు వానకాలంలో వంద కిలోల వడ్లు ఇస్తే 67కిలోల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నామని చెప్పారు. యాసంగికి వచ్చే సరికి వరి పాల దశ నుంచి గింజ దశకు మారే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గింజ పగులుతుందని, దీంతో పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే పారాబాయిల్డ్ బియ్యాన్ని దేశంలో ఎవరూ తినడం లేదని, యాసంగి వడ్లుకొనబోమని కేంద్ర ప్రభు త్వం స్పష్టంగా సర్క్యులర్ ఇచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాను, మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర సివిల్ సప్లయీస్ మంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల పెట్టుబడి పెట్టి వడ్లు కొనిపెట్టిందని, 50 లక్షల మెట్రిక్ ధాన్యం నిలువ ఉందని చెప్పినట్లు వివరించారు. బియ్యం తీసుకోవాలని కేంద్ర మంత్రిని రెక్వెస్టు చేస్తే.. తీరా 20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతాది కొనలేమని చెప్పేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు.
యాసంగి వడ్లు కొంటామని కేంద్రం చెప్పేదాకా రైతుల పక్షాన పోరాడాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని మంత్రి చెప్పారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రానికి సెగతాకేలా ఆందోళనలు ఉంటాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పటికి కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల కోసం ధర్నా చేస్తున్నామని చెప్పారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిని ఒక్కటే అడుగుతున్నామని, పత్రికల్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదని, మేం రాష్ట్రంలో ధర్నా చేస్తున్నామని, మీరు ఢిల్లీలో నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్ ఇండ్ల ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే ధాన్యంలో ప్రతి గింజా కొంటామని కేంద్రాన్ని ఒప్పిస్తే సంజయ్, కిషన్‌రెడ్డిని రాష్ట్ర రైతుల పక్షాన తానే స్వయంగా సన్మానిస్తానని గంగుల స్పష్టం చేశారు. ఉత్త మాటలు చెప్పి ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు అడిగారని, ఎవరూ స్పందించక పోవడంతో ఈనెల12న ధర్నా చేస్తున్నామని చెప్పారు.
తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. నగరంలో హోటల్లో ప్రెస్‌మీట్‌కు ముందు జిల్లా ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ధర్నాలు కొనసాగుతాయని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో కలెక్టరేట్ ఎదుట, చొప్పదండి నియోజకవర్గంలో గంగాధరలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట, మానకొండూర్ నియోజకవర్గంలో మానకొండూర్‌లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రం వడ్లు కొనబోమని చెప్పడంతో యాసంగిలో ఏ పంటలు వేయాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో ఉన్నారని, వారికి సరైన స్పష్టత రావాలంటే కేంద్రంతో పోరాటం అనివార్యంగా తాము భావిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొవిడ్ నిబంధనల మేరకు ఆందోళనలు చేస్తామని, అధికారులు కూడా అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. వరి సాగుకు ఇంకా సమయం ఉందని, కేంద్రం అనుమతి ఇచ్చే దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు చేస్తున్న అన్యాయాన్ని రైతులకు వివరించేలా కార్యక్రమం సాగించాలన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నాయకులు గెల్లు శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.
తెలంగాణపై వివక్ష ఎందుకు..?
యాసంగి వడ్లు ఎందుకు కొనరని సీఎం కేసీఆర్ స్పష్టంగా కేంద్రాన్ని నిలదీస్తున్నారని మంత్రి గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ ఇస్తున్నామని, అందులో లాభాలు వస్తున్నాయికదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. బాయిల్డ్ రైస్ కొనమని చెప్పిన కేంద్రం.. పంజాబ్‌లో మాత్రం 1.35 కోట్ల మెట్రిక్ టన్నులు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే కేంద్రం వివక్ష చూపుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వడ్లు కొనమని చెబుతున్నారని, కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వరిసాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు ఇక్కడ ఒకటి ఆలోచించాలని కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటామని చెబితే వరి సాగుకు ప్రభుత్వానికి ఇబ్బంది లేదన్నారు. బాయిల్డ్ రైస్ తీసుకుంటామని కేంద్రం నుంచి రాత పూర్వకంగా లేఖ తెప్పించాలని కోరితే ఇప్పటి వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదని, వారి మాటలు నమ్మొద్దని రైతులకు సూచించారు.