12న ధర్నాలో అన్నదాతలను భాగస్వాములను చేయాలి
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 10: కులం, మతం లేనివారు రైతులని.. వారిని ఆగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న ధర్నాపై నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వడ్లను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. నేడు దానిని విస్మరించి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నదన్నారు. దీనిపై రైతులకు వివరించాలని, ధర్నాలో వారిని భాగస్వాములను చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్నా స్థల పరిశీలన
మానకొండూర్, నవంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి పల్లెమీద చౌరస్తా వద్ద స్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ధర్నాకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గంట మహిపాల్, నెల్లి మురళి, శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.