హుజురాబాద్ టౌన్, నవంబర్ 10: బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల, ప్రజాప్రతినిధుల సమావేశం బుధవారం గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లు చేయబోమని చెప్పడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు ఇస్తూ రైతుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ధాన్యం కొనుగోలుకు ససేమిరా అనడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు రైతుల విషయంలో రెండు నాలల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా విపత్కర సమయంలో అండగా ఉండి మద్దతు తెలుపుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్‌పై తమ ఇష్టం వచ్చినట్లు నోరు జారడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాను ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉండి ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకుంటానని చెప్పారు. ఇక్కడి ప్రధాన పంట వరి అయినందునా, ఇక్కడ పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా తమ డిమాండ్‌ను ఆందోళనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలపడం కోసం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 12న చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 12న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామని, ఈ ధర్నాకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 5వేల మంది తరలిరావాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతుల ఆందోళనలు జరుగుతాయని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీటీసీలు పడిదం బకారెడ్డి, శ్రీరాం శ్యామ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ టి రాజేశ్వరరావు, హుజూరాబాద్ మారెట్ చైర్పర్సన్ బర్మవత్ రమయాదగిరి, పార్టీ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, సింగిల్‌విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, కౌరు సుగుణాకర్‌రెడ్డి, సంపత్‌రావు, మాడ సాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.