హాజరుకానున్న మంత్రి కేటీఆర్
రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలి
నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పిలుపు
సిరిసిల్ల టౌన్, నవంబర్ 10: వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్లో రైతు ధర్నా కార్యక్రమం ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి కారణంగా తెలంగాణ రైతాంగం ఆందోళనకు గురవుతున్నదన్నారు. వ్యవసాయ అనుబంధ సంస్థలు, సహకార సంఘాలు, రైతు బంధు సమితులు, మార్కెట్ కమిటీల ప్రతినిధులకు రైతులు తమగోడును వెల్లబోసుకుంటున్నారని చెప్పారు. ఏడేండ్ల స్వయం పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా తయారుచేస్తే కేంద్రం పెద్దల విభిన్న ధోరణితో వ్యవసాయ రంగం ప్రశ్నార్థకమైందన్నారు. పంజాబ్లో కొనుగోళ్లు చేస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల భారం వ్యవసాయ రంగం పైనా పడుతుందన్నారు. రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు చేపడుతున్న ఈ రైతు ధర్నా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని రైతులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు కృష్ణహరి, కొమిరె సంజీవ్గౌడ్, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, నరసింహరెడ్డి, షేక్ సిఖిందర్, తదితరులున్నారు.