నాడు అదిగో ఇదిగో అంటూ ఈటల కాలయాపన
20 ఏళ్లుగా విన్నపాలు.. అయినా పట్టింపు కరువు
రూ.10లక్షలు మంజూరైనా ప్రొసీడింగ్ ఇవ్వని వైనం
తాజాగా నెరవేరిన స్వప్నం
ఎకరం స్థలం, నిర్మాణానికి రూ. కోటి నిధులు
మంత్రి గంగుల చేతుల మీదుగా ప్రొసీడింగ్‌లు
ఆనందంలో పద్మశాలీలు
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్: రెండు దశాబ్దాల కల.. పద్మశాలీల ఆత్మగౌరవ స్వప్నం నెరవేరింది. 20ఏళ్లుగా కాళ్లరిగేలా తిరిగినా.. ఈటల రాజేందర్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని సమస్యకు తాజాగా పరిష్కారం దొరికింది. మంత్రి గంగుల కృషి.. సీఎం కేసీఆర్ కరుణతో కమ్యూనిటీ భవనానికి మోక్షం లభించింది. మంగళవారం భవన నిర్మాణానికి అహల్యానగర్‌లో ఎకరా స్థలంతోపాటు రూ. కోటి నిధులు మంజూరు కాగా, పద్మశాలీ లోకం మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మంగళవారం హుజూరాబాద్ సిటీ సెంటర్లో మంత్రి గంగుల చేతుల మీదుగా అందుకొని సంబురపడ్డది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరువేలకుపైగా పద్మశాలీ కుటుంబాలు ఉన్నాయి. తమ కుల సంఘం భవనం కోసం ఎన్నో ఏండ్లుగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు విన్నవిస్తూనే ఉన్నారు. ఈటల చుట్టూ ఇరవై ఏండ్లుగా తిరుగుతూనే ఉన్నారు. శుభకార్యాలు, చిన్నపాటి మీటింగ్‌లు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉందని, గుంట స్థలమైనా ఇవ్వాలని అడిగారు. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. తిరుగంగ తిరుగంగ ఒకసారి రూ.10 లక్షలు మంజూరయ్యాయని చెప్పిన ఈటల.. వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మాత్రం ఇవ్వలేదని వాపోయారు. ఇదేంది సార్ అని అడిగితే.. ప్రొసీడింగ్ ఇవ్వకపోగా ‘మీరే బాగా బలిసినోళ్లు.. మీకెందుకయ్యా డబ్బులు’ అని అవమాన పర్చేలా మాట్లాడారని ఈటల తీరుపై మండిపడ్డారు.
తాజాగా ఎకరా స్థలం.. కోటి నిధులు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి గంగుల దృష్టికి పద్మశాలీలు ఈ విషయాన్ని దృష్టికి తెచ్చారు. తర్వాత గంగుల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించారు. కమ్యూనిటీ భవనానికి హుజూరాబాద్‌లోని అహల్యనగర్‌లో రూ.5 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని కేటాయించారు. నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశారు. మంగళవారం హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్లో సంఘ ప్రతినిధులకు నిధులు, స్థలానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. పద్మశాలీ సంఘ భవనాన్ని ఆరు నెలల్లో నిర్మించి ఇస్తామని ప్రకటించారు. దాంతో పద్మశాలీలు ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలీ శ్రేయస్సు కోసం సీఎం కృషి
పద్మశాలి సమాజ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ మంత్రి ఎల్ రమణ పేర్కొన్నారు. నేతన్నలకు ఎంతో చేయాల్సి ఉందని, అందుకు తన సేవలు అవసరం అవుతాయని సీఎం తనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని, ఆయనతో కలిసి నడిచి పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. పద్మశాలీలు మరింత ఐక్యంగా ఉండాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పద్మశాలీలవి 25 వేల ఓట్లు ఉన్నాయని, వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని సూచించారు. పద్మశాలి సంఘం జిల్లా నాయకుడు వాసాల రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైఎస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణీ, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు సబ్బని మొగిలి, కార్యదర్శి వీడపు రాజు, మండల అధ్యక్షులు వేముల యాదగిరి, కార్యదర్శి సంగెం ఐలయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఆరు నెలల్లో భవన నిర్మాణం
ఆరు నెలల్లో పద్మశాలీ భవనాన్ని నిర్మించి ఇస్తామని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పద్మశాలీ భవనానికి స్థానిక అహల్యనగర్‌లో రూ. 5 కోట్లకుపైగా విలువైన ఎకరం స్థలం, భవన నిర్మాణానికి రూ. కోటి ప్రొసీడింగ్‌లను మంగళవారం హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశాలీలకు మంత్రి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ పద్మ శాలీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కానీ, భవన నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ను రూ.50 లక్షలు అడిగితే రూ.కోటి మంజూరు చేశారని తెలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని పద్మశాలీలను సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటున్నారని చెప్పారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడే నేతన్నల కోసం జోలె పట్టుకుని రూ.50 లక్షల విరాళాలు సేకరించి అందించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే హుజూరాబాద్ ఎందుకు వెనుకబడిందో ఆలోచించాలన్నారు. ఈటల రాజేందర్ ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, అలాంటి పార్టీలో చేరిన ఈటల నియోజకవర్గంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. నిరుపేదలకు 4 వేల ఇండ్లు కట్టించమని సీఎం కేసీఆర్ మంజూరు చేయిస్తే ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయించ లేని ఈటల మళ్లీ మీ వద్దకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. వచ్చే ఉప ఎన్నికలు చాలా కీలకమైనవని, టీఆర్ఎస్ గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈటలకు ఓటు వేయం..
పద్మశాలీల గురించి ఈటల రాజేందర్ ఏనాడూ పట్టించుకోలేదు. పనుల కోసం వెళ్తే కనీసం పలుకరించకపోవు. హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి కూడా ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేయని అభివృద్ధి పనులను టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నది. పద్మశాలీలు ఈటలకు ఆయనకు ఓటు వేయరు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటం..
పద్మశాలీ సంఘ భవనం కోసం ఎకరం స్థలంతో పాటు నిర్మాణానికి రూ.కోటి నిధులు కేటాయించిన్రు. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌కు రుణపడి ఉంటం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికే మద్దతు ఇస్తం.