GO No. 282 | పెద్దపెల్లి టౌన్ జులై 6 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కార్మికుల పుండు మీద కారం చల్లిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినం చేసేందుకు విడుదల చేసిన జీవో నం. 282 తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 282 ప్రతులను ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కార్మికుల శ్రమ శక్తిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు, బడా కంపెనీలు అధిక లాభాలు పొందేందుకు వీలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో నం.282 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ఆ రాష్ట్రాల చట్టాలను కాపీ కొడుతూ తెలంగాణలో కార్మికులు 10 గంటల పని చేయాలని చట్టబద్ధత ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు.
ప్రపంచ కార్మికులు పోరాడి సాధించుకున్న మే డే స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, మానవతా విలువలను మంటగలుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆనందిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల నిరసిస్తూ జులై 9 నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్న విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగంపల్లి నరేష్, ఎండీ ముస్తఫా, బొంకూర్ సాగర్, పల్లె రవి, చంద్రయ్య, కుమ్మరి నవీన్, మధు తదితరులు పాల్గొన్నారు.