పెద్దపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలోని ఆర్అండ్బీ శాఖను సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో రూ.కోట్ల విలువైన రోడ్లు, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులపై పర్యవేక్షణ లేక నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఈఈ ఆఫీస్‌తో పాటు, పెద్దపల్లి భవనాల డివిజన్ కార్యాలయం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో సబ్ డివిజన్లు ఉన్నాయి.
ఈ కార్యాలయాల్లో 50 సాంక్షన్ పోస్టులు ఉండగా 26 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఒకో సబ్ డివిజన్‌కు డిప్యూటీ ఇంజినీర్ ఉండాలి. కానీ, మంథని, పెద్దపల్లికు మాత్రమే డీఈలు ఉండగా, వారికే పెద్దపల్లి, సుల్తానాబాద్ సబ్ డివిజన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. 10 ఏఈఈ, ఏఈ పోస్టుల్లో ఇద్దరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఏఈఈల్లో ఒకరు పెద్దపల్లి డివిజన్లో, మరొకరు మంథని డివిజన్లలో పని చేస్తున్నారు.
ఇద్దరు ఏఈల్లో ఒకరు రామగుండం, మరొకరు మంథనిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీలు అధికంగా ఉండడంతో ప్రస్తుత అధికారులపై పని ఒత్తిడి తీవ్రంగా పడుతున్నది. ఫలితంగా పసులపై సరైన పర్యవేక్షణ లేక నాణ్యత లోపిస్తున్నది. సకాలంలో పూర్తికావాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త పనులకు అంచనాలు రూపొందించడానికి సమయం సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు కూడా రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
పనులపై పర్యవేక్షణా లోపం
ఇంజినీరింగ్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పనుల్లో నాణ్యత లోపిస్తున్నది. జిల్లాలోని ఆర్అండ్బీ శాఖ పరిధిలో 859 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. వీటి నిర్మాణం, మరమ్మతులు, పర్యవేక్షణ అంతా క్షేత్ర స్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు చేయాలి.ప్రస్తుతం జిల్లాలో కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రామగుండంలో సు మారు 500 కోట్లతో మెడికల్ కళాశాల, దవాఖాన భవనా ల పనులు, పెద్దపల్లి నుంచి కూనారం వెళ్లే రహదారిలో 119 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి, వివిధ వాగులపై వంతెన లు, డబుల్ రోడ్లు, సింగిల్ బీటీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాల్సి ఉంటుంది. ఆర్అండ్బీ శాఖకు చెందిన పనులే కాకుండా పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో జరగాల్సిన పనులను సైతం అప్పుడప్పుడు ఆర్అండ్ బీ అధికారులకు అప్పగిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు పనుల ను సైతం ఈ శాఖకే అప్పగించారు. దీంతో ఈ పను ల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
పనులు వేగంగా చేపడుతున్నాం.
జిల్లాలో రామగుండం మెడికల్ కళాశాల, దవాఖాన నిర్మాణం, పెద్దపల్లిలో కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రధానంగా జరుగుతున్నాయి. వీటికి తోడు మరమ్మతు పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు సైతం వేగంగా చేపడుతున్నాం. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బైపాస్ రోడ్ల నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఆ మేరకు అంచనాలను సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ప్రారంభిస్తాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ పనుల్లో పర్యవేక్షణ గానీ, పరిశీలనలో గానీ ఎక్కడా తగ్గకుండానే పనిచేస్తున్నాం.
– భావ్‌సింగ్, ఈఈ, రోడ్లు, భవనాల శాఖ (పెద్దపల్ల్లి)