నగరంలో ప్రధాన రహదారులపై ప్రత్యేక దృష్టి
నాలుగు రోజులుగా కొనసాగుతున్న చర్యలు
కార్పొరేషన్, జనవరి 9: నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు చర్యలు ప్రారంభించారు. నాలుగు రోజులుగా ఉదయం నుంచే ఈ ఆక్రమణలకు ప్రత్యేకంగా నియమించిన బృందం సభ్యులు తొలగింపు పనులు చేపడుతున్నారు. మొదటి దశలో నగరంలోని 14 కిలోమీటర్లలో ఉన్న ప్రధాన రహదారుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి వారం పూర్తిగా ప్రధాన రహదారుల్లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి ఆర్టీసీ వర్క్‌షాపు, మంచిర్యాల చౌరస్తా నుంచి చొప్పదండి రోడ్డు, నాకా చౌరస్తా, తెలంగాణ చౌక్ నుంచి సిరిసిల్ల రోడ్డులో ఆక్రమణలను తొలగింపు పనులు చేపట్టారు. నగరంలోని రోడ్డు, ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేకంగా నగరపాలక సంస్థ నుంచి టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు చేశారు. ఇందులో బల్దియాకు చెందిన వివిధ విభాగాల సిబ్బందితో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు.
వారం వారం ప్రణాళికలు
నగరంలోని ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణల తొలగింపు విషయంలో నగరపాలక సంస్థ అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. నగర కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ బృందంతో ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహించి, పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రతి మంగళవారం సమావేశం నిర్వహించి ఈ వారంలో ఏఏ రోడ్లపై ఆక్రమణలను తొలగించాలన్న విషయంపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మేరకు ఈ వారం ఆయా ప్రాంతాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించి ఆక్రమణలను తొలగిస్తారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రధాన రహదారుల్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. రాబోయే రోజుల్లో డివిజన్ల లింక్ రోడ్లు, ఇతర రోడ్లపై ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మొదటి సారి హెచ్చరిక చేయడంతో పాటు ఆక్రమణలను సీజ్ చేస్తున్నారు. మరోసారి వ్యాపారులు ఫుట్‌పాత్ ఆక్రమిస్తే మరింత కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులెవరూ ఫుట్‌పాత్‌లపై సామగ్రి ఉంచవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చేపట్టిన షెడ్లు, ప్రచార బోర్డులను తొలగించి బల్దియా కార్యాలయానికి తరలించారు. ఇకపై తొలగింపు ప్రక్రియ నిరంతరం చేపడుతామని అధికారులు తెలిపారు.