కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ);ఇప్పుడు.. దళితుల దశ మారింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన చారిత్రక దళిత బంధు పథకం చితికిన బతుకులకు కొత్తదారి చూపింది. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని దశాబ్దాల పాటు ఎదురుచూసి చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగురేఖగా నిలిచింది. నిన్న మొన్నటిదాకా దినసరి వేతనానికి ఒకరి వద్ద పనిచేసిన కూలీలను యజమానులుగా మార్చింది. ఇందుకు హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన ఇల్లందుల శైలజ-హరీశ్ కుటుంబమే నిదర్శనంగా నిలుస్తున్నది. మొన్నటిదాకా భవన నిర్మాణ లేబర్లుగా పనిచేసి, చాలీచాలని కూలీతో ఇద్దరు ఆడపిల్లలను సాకలేక కష్టాలు పడ్డ వారిని డెయిరీకి ఓనర్లను చేసి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. పథకం కింద నాలుగు బర్రెలు తీసుకొని పాలు అమ్ముకుంటున్న ఈ కుటుంబం రెండు నెలల్లోనే ఎంతో మార్పు చెంది, కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. నెలకు రూ.40 వేల ఆదాయం పొందుతూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నది. ఇలా ఒక్క శైలజే కాదు యూనిట్లు పొందిన అందరి జీవితాలకు దళిత బంధు బతుకుదారి చూపుతున్నది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన ఇల్లందుల శైలజ, హరీశ్ దంపతులు రెండు నెలల కిందటి వరకు భవన నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేసుకుని జీవించే వాళ్లు. వచ్చిన కూలీ డబ్బులతో ఇద్దరు ఆడ పిల్లను చదివించుకునే వాళ్లు. ప్రతి రోజూ కూలీ పనులు దొరకగా ఇబ్బందులు పడే వారు.
పిల్లల పోషణ కోసం బయట అప్పులు చేసేవారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళిత బంధు అమలుకు సీఎం కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం, లబ్ధిదారురాలుగా శైలజ ఎంపిక కావడం, డెయిరీ యూనిట్‌ను ఎంచుకోవడం జరిగింది. ఇదే హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న పది మంది లబ్ధిదారులతో కాకుండా జిల్లా అధికారులు మరో 23 మందిని ఎంపిక చేసి హర్యానాకు తీసుకెళ్లి బర్రెలు కొనిచ్చారు. అందులో శైలజ దంపతులు కూడా ఉన్నారు. మొదటి విడుతగా తెచ్చుకున్న నాలుగు బర్రెలే ఇపుడు ప్రతి రోజు ఉదయం 20 లీటర్లు, సాయంత్రం మరో 20 లీటర్ల పాలు ఇస్తున్నాయి. దీంతో వారికి ప్రతి రోజు ఆదాయం రూ.2 వేల దాకా వస్తున్నది. రెండు నెలలుగా నెలకు రూ.40 వేల ఆదాయం వస్తోందని శైలజ దంపతులు చెబుతున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు మిగులుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూర్తిగా బర్రెల పోషణ చూసుకుంటూ గతంలో వారి కూలీ జీవితానికి స్వస్తి పలికారు. రెండో విడుతలో మరో నాలుగు బర్రెలు ఇస్తామని అధికారులు చెబుతుండగా రెట్టింపు ఆదాయం వస్తుందని ఆ దంపతులు చెబుతున్నారు.
కలెక్టర్ అభినందనలు..
దళిత బంధు ఇప్పటికే ఇచ్చిన యూనిట్లను ఏ విధంగా నిర్వహించుకుంటున్నారనే విషయాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శనివారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో పర్యటించారు. డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకుని విజయవంతంగా నడిపించుకుంటున్న లబ్ధిదారులను అభినందించారు. నెలకు రూ. 50 వేల వరకు సంపాదించుకుంటున్నామని లబ్ధిదారులు చెప్పడంతో కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంపికైన లబ్ధిదారులకు మిగతా యూనిట్లు అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, కలెక్టర్ కసరత్తు ముమ్మరం చేశారు.
వీళ్ల జీవితాలు మారిపోయాయి..
నిన్న వ్యవసాయ కూలీలుగా పనిచేసిన కొత్తూరి రాధ-మొగిలి, ఈర్ల మల్లమ్మ-కొమురయ్య దంపతులు సైతం నేడు దళిత బంధు పథకంతో డెయిరీ యజమానులుగా మారారు. కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ-మొగిలి దంపతులు, జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన ఈర్ల మల్లమ్మ-కొమురయ్య దంపతులు గతంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవన పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు పడ్డారు. కాగా, అక్టోబర్ 2021లో దళిత బంధు పథకం కింద కొత్తూరి రాధ-మొగిలి, ఈర్ల మల్లమ్మ-కొమురయ్యకు 10లక్షలు మంజూరుకాగా, అధికారులతో హర్యానా వెళ్లి మొదటి విడుతగా 4 పాడి గేదెలు కొని తెచ్చుకున్నారు. ఈ పథకం కింద ముందుగా డెయిరీ షెడ్ వేసుకునేందుకు 1.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. తెచ్చుకున్న 4 పాడి గేదెలను భార్యాభర్తలు కలిసి పోషించుకుంటూ కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీకి పాలు అమ్ముతున్నారు. అన్ని ఖర్చులు పోగా తమకు నెలకు రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని లబ్ధిదారులు చెప్పారు. రెండో విడుత మరో 4 గేదెలు తెచ్చుకుని చకని పోషణతో నెలకు రూ.50వేల దాకా ఆదాయం గడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ డెయిరీ యూనిట్ల ద్వారా తాము మాత్రమే ఉపాధి పొందడం కాకుండా మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతామని చెప్పారు.
డెయిరీలతో వెలుగులు
దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని దళితులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.9.90 లక్షలు జమ చేశారు. ఇందులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న 10 మందికి హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. వివిధ యూనిట్లను ఎంపిక చేసుకున్న వారు బేషుగ్గా పనులు చేసుకుంటూ నెల కింత సంపాదించుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దళిత బంధు పథకం కొనసాగించవచ్చని మొదట ఈసీ చెప్పిన నేపథ్యంలో మరో పాడి యూనిట్లు ఎంచుకున్న 23 మంది లబ్ధిదారులను అధికారులు హర్యానా తీసుకెళ్లి బర్రెలు కొనిచ్చారు. ఆ తర్వాత ఈ పథకంపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా నిలిపి వేశారు. రెండో విడుతలోని 23 మందిలో ఉన్న శైలజ, హరీశ్ దంపతులు అధికారులతో కలిసి గతేడాది అక్టోబర్‌లో హర్యానా వెళ్లి నాలుగు బర్రెలు తెచ్చుకోగా, పాల వ్యాపారం ద్వారా ఈ రెండు నెలల్లో వారి జీవితమే పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ సార్ దయతోనే తమ బతుకులు మారిపోయాయని ఈ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంపికైన అందరు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆరే మా దేవుడు..
కేసీఆర్ అంటే మాకు దేవుడు. ఎంత కట్టపడి పనిచేసుకున్నా మా బతుకులు మారేటియిగాదు. రొండు నెలల కిందిదాకా సుతారి పనికి పొయ్యెటోళ్లం. మాకిద్దరికి ఒక రోజు పనుంటే ఇంకో రోజు ఉండేటిదిగాదు. మాకిద్దరు ఆడి పిల్లలు. ఇల్లు గడుసు కష్టమయ్యేటిది. నెల కింత అప్పు తప్పెటిదిగాదు. సీఎం కేసీఆర్ సారు రొండు నెలల కింద నాలుగు బర్రెలు కొనిచ్చిండు. ఇద్దరం ఇవిటితోనే కట్టపడుతున్నం. రోజు పదిహేన్నుంచి రొండు వేలు ఎటువోతలేవు. నెలకు నలభైవేలు కండ్ల సూత్తన్నం. దానా, ఇతర ఖర్సులు తీసేస్తే నెలకు రూ.30 వేలు మిగులుతున్నయ్. మాకు ఇసొంటి మంచి రోజులస్తయని కలలగూడ అనుకోలే. ఈ రకంగా మా బతుకులు మార్సిన సీఎం కేసీఆర్ సారు మాకిపుడు దేవుడిలెక్క. తండ్రి లెక్క. ఆయన రుణం ఎప్పటికీ తీర్సుకోం. మా లెక్కనే దళితులందరు కష్టవడి చేసుకుంటే ఖచ్చితంగా బాగుపడ్తరు.