ఉమ్మడి జిల్లాలో రైతు బంధు వారోత్సవాల జోరు
పల్లెపల్లెనా రైతుల సంబురాలు
ఎడ్లబండ్లతో ర్యాలీలు..
మహిళలకు ముగ్గుల పోటీలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
కరీంనగర్ నెట్వర్క్, జనవరి 9:రైతులు మురిసిపోతున్నారు. ఆది నుంచీ అండగా నిలుస్తూ, పెట్టుబడి సాయం చేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్కు నీరాజనం పడుతున్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సంబురాలు హోరెత్తించారు. వ్యవసాయ క్షేత్రాలతోపాటు గ్రామ ప్రధాన కూడళ్లలో ‘జై కేసీఆర్, జై రైతు బంధు’ అంటూ ఆకృతులు గీయడంతోపాటు తమ ప్రియతమ నేత చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.
జగిత్యాల రూరల్ మండలం చల్గల్, లక్ష్మీపూర్, పొలాస, కల్లెడ, పొరండ్ల గ్రామాల క్లస్టర్ పరిధిలో రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పాల్గొన్నారు. బుగ్గారం మండల కేంద్రంలో రైతులు ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి, చెర్లపల్లి, కిషన్రావుపేట గ్రామాల్లో సర్పంచ్లు, రైతుబంధు కన్వీనర్లు, ముగ్గుల పోటీలు, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. పాలకుర్తి మండలంలో కొత్తపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. జూలపల్లి మండలం వడ్కాపూర్లోని రైతు వేదిక వద్ద రైతులను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ సన్మానించారు. ధర్మారం మండలం కొత్తూరు పంచాయతీ కార్యాలయం ఎదుట జీపీ పాలకవర్గం, టీఆర్ఎస్, రైతుబంధు సమితి నాయకులు ‘జై కేసీఆర్, జై కేఈఆర్, ‘జై రైతుబంధు’ 50 వేల కోట్లు’ జై తెలంగాణ పేరిట బంతిపూలతో అలంకరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీశారు. కమాన్పూర్ మండలం జూలపల్లిలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలువురు రైతులను పెద్దపల్లి డీఏఓ తిరుమల ప్రసాద్ సన్మానించారు.
తంగళ్లపల్లి మండలం నేరేళ్ల సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో ముగ్గులువేశారు. దుమాల, కోరుట్లపేట, బొప్పాపూర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. బొప్పాపూర్లో ఆదర్శ రైతులను శాలువాతో సన్మానించారు. బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో ఓ రైతు పొలంలో వరి నారుతో సీఎం కేసీఆర్ పేరు రాయగా ప్రజా ప్రతినిధులు చూసి రైతును అభినందించారు. వేడుకల్లో భాగంగా తిమ్మాపూర్ రూరల్ మండలం ఎల్ఎండీ కాలనీలో శ్రీ చైతన్య ఇంజినీరింగ్ విద్యాసంస్థల ఆవరణలో క్రికెట్ పోటీలు నిర్వహించగా,ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు. కాగా, ఫైనల్ మ్యాచ్లో మీడియా, వ్యవసాయశాఖ జట్లు తలపడగా వ్యవసాయ శాఖ విజయం సాధించింది. గంగాధర మండలం నారాయణపూర్లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పుష్పాభిషేకం చేశారు. గట్టుభూత్కూర్లో మహిళలలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.