ఈటల కనీసం ఒక్క ఇల్లయినా కట్టించిండా..?
ఓట్లేసి గెలిపిస్తే చేతగాక రాజీనామా చేసిండు
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
వీణవంక, అక్టోబర్ 8 : రైతు సంక్షేమ రాజ్యం కావాల్నా.. రైతులను పొట్టన పెట్టుకుంటున్న రాజకీయ పార్టీ కావాల్నా.. మీరే ఆలోచించండి. మీ బిడ్డగా నన్ను గెలిపించండి. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ భార్య జమున ఆస్తులు అమ్మైనా గెలువాలంటున్నది. 200 ఎకరాలుంది. ఎకరం అమ్మినా గెలుస్తం అని చెబుతున్నది. ఈ ఎన్నిక ఈటల అహంకారానికి.. పేదల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నది. మీరంతా ధర్మంవైపు, న్యాయంవైపు నిలబడాలె. ఇన్నేండ్లు ఈటల అధికారంలో ఉండి ఏం చేసిండు? పేదలను ఏనాడైనా పట్టించుకున్నడా..? కనీసం ఒక్క ఇల్లయినా కట్టించిండా? ఇప్పుడు గెలిపిస్తే బీజేపీలో ఉండి మన కష్టాలు తీరుస్తడా..? అన్నం పెట్టిన సీఎం కేసీఆర్‌పైనే కుట్రలు చేసిండు. ప్రజాసేవ చేతగాకే రాజీనామా చేసిండు. రైతులను పొట్టన పెట్టుకుంటున్న పార్టీ పంచన చేరిండు. ఆయన మనకెందుకు?
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని సంక్షేమం వైపు నడిపిస్తుంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం రైతులను పొట్టనబెట్టుకుంటున్నదని టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, దేశాయిపల్లి, కిష్టంపేట, చల్లూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొనగా, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు నెత్తిన బతుకమ్మలు, బోనాలు ఎత్తుకోగా కళాకారులు కోలాటం ఆడారు. డప్పుచప్పుళ్ల మోతలు, జై తెలంగాణ నినాదాలతో యువకులు హోరెత్తించారు. ఇండ్లకు తాళాలు వేసి ప్రజలు ప్రచారానికి తరలిరాగా, రోడ్ల వెంట భారీ ర్యాలీ తీసి గెల్లుకు మద్దతు తెలిపారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ.. గొర్రె పిల్లలను బహూకరిస్తూ, గొంగడి కప్పి ఘనంగా సన్మానించారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి గెల్లు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రిగా నియోజకవర్గంలో ఒక్క పనిచేయనోడు.. రేపు ఎమ్మెల్యేగా ఏం చేస్తడు అని ఈటలను ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో ప్రజలంతా వారి గోడును చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఆరుసార్లు అవకాశం ఇచ్చి, మంత్రిగా చేసిన సీఎం కేసీఆర్‌కు గోరి కడుతానని ఈటల అనడం సమంజసం కాదన్నారు. ధరలు పెంచుతూ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, పెట్టుబడిదారులకు అండగా నిలుస్తున్న బీజేపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయాచోట్ల ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, సర్పంచులు పోతుల నర్సయ్య, జున్నుతుల సునీత-మల్లారెడ్డి, చదువు లక్ష్మి-మహేందర్‌రెడ్డి, బండ సుజాత-కిషన్‌రెడ్డి, బండారి ముత్తయ్య, పొదిల జ్యోతి రమేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, ఎంపీటీసీలు నాగిడి సంజీవరెడ్డి, ఒడ్డెపెల్లి లక్ష్మి-భూమయ్య, చదువు స్వరూప-నర్సింహారెడ్డి, ఎలవేన సవిత-మల్లయ్య, నాయకులు సత్యనారాయణ, సురేశ్, రాజయ్య, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
బిడ్డా నువ్వే గెలుస్తవ్
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా వీణవంక మండలం ఘన్ముక్లలో పర్యటించగా, అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు పులిపాక ఎల్లమ్మ దీవించింది. ర్యాలీగా వెళ్తున్న గెల్లును ఆప్యాయంగా పలుకరించి, ‘ఈ అవ్వ దీవెనలు నీకే బిడ్డా.. నువ్వే గెలుస్తవ్’ అంటూ ఆశీర్వదించింది.