మున్ముందు సమస్య పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి
నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలి
సిరిసిల్లలో అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
వరద పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్ష
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తులో వరదలు వచ్చినా ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సిరిసిల్ల అధికారులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరదనీటితో డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. భారీ వర్షాలకు సిరిసిల్ల అతలాకుతలం కాగా, బుధవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో పర్యటించారు. మధ్యాహ్నం 3.30గంటలకు జిల్లా కలెక్టరేట్లో వరద ప్రభావం, బాధితులకు సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సమీక్షించారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా ఎలాంటి నష్టం కలుగకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం చెరువు మత్తడి దూకి బోనాలలోని పెద్దచెరువు, జంగమయ్య, శుద్దగండి చెరువులు నిండి మత్తళ్లు దూకడంతో సిరిసిల్లలోని పలు వార్డులు జలమయ మైనట్లు అధికారులు వివరించారు. సిరిసిల్లతోపాటు వేములవాడ పట్టణంలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా, కాలనీల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, నష్టం అంచనా సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సిరిసిల్ల మానేరు, మూల వాగుల చుక్క నీరు వృథా కాకుండా మధ్యమానేరులో కలిసేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వరదలతో ప్రజలు ఇబ్బందులకు కలుగకుండా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సూచించారు.
రోడ్ల మరమ్మతులకు 1.35 కోట్లు..
ఎనిమిది మండలాల్లో ఆర్అండ్బీ, పంచాయతీ పరిధిలోని రోడ్లు దెబ్బతిన్నట్లు ఆయా శాఖల అధికారులు వివరించగా, మంత్రి వెంటనే స్పందించారు. వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం 1.35 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిధులతో యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వరద నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని, అందుకు ఇంకా ఎన్ని మురుగు కాలువలు నిర్మించాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులకు అప్పగించాలన్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చే యేడాది రాదన్న భరోసా పెట్టుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నాలాలపై నిర్మాణాలకు పర్మిషన్ వద్దు
నాలాలపై ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఎవరైనా ఇండ్ల నిర్మాణాలు చేపడితే వెంటనే వాటిని తొలగించి, అందులో ఉన్న కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించాలని సూచించారు. వరద ప్రమాదంలో కూలిన ఇండ్లకు, మరణించిన వ్యక్తి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని ఆర్డీవోను ఆదేశించారు. బైపాస్‌లో 38 కోట్లతో డ్రైనేజీ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం..
పంటలు నష్టపోయిన రైతులకు వారంలోగా పరిహారం అందించి వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రైతులెవరూ దొడ్డు బియ్యం పంటలు వేయకుండా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యాన పంటలు, ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి పెంపొందించాలని అగ్రికల్చరల్, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 666 చెరువుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వారంలోగా పరిష్కరించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. వరదలతో పడిపోయిన కరెంటు స్తంభాలకు వెంటనే మరమ్మతు చేయాలని సెస్ అధికారులకు సూచించారు. ఎంతో కష్టపడి మల్టీలెవల్ ప్లాంటేషన్లు ఏర్పాటు చేసుకున్నామో వాటిని కాపాడే బాధ్యత మనపై ఉందని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే అందుకు చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
వర్షాల వల్ల సీజనల్ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వేడి చేసి చల్లార్చిన నీరు తాగేలా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దవాఖానలో అవసరమైన మందులతోపాటు రక్త నిల్వలు ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసే అంశంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో పనిచేసిన వైద్య సిబ్బంది కోసం రూ.కోటి మంజూరు చేశామని, వాటిని సిబ్బందికి అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండెపల్లిలోని ఐటీఐ కళాశాల ప్రహరీ కూలిపోయినందున సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. వేములవాడలో వర్షానికి కూలిన బ్రిడ్జి సెంట్రింగ్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే శివరాత్రి వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ప్రజాప్రతినిధులు, ఆర్అండ్బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతినగర్‌లో టీఆర్ఎస్ పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ ఉన్నారు.