పనిచేసే పార్టీని ఆశీర్వదించండి
బీజేపీతో జరిగేదేం లేదు
కేంద్రంలో అధికారంలో ఉండి ధరల భారం మోపుతున్నది
పథకాలను పరిగె అన్నోళ్లు కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తేవాలి
సీఎం కేసీఆర్‌తోనే ముదిరాజ్‌ల బతుకులు మారాయి
రెండు రోజుల్లో చేప పిల్లల పంపిణీ
ప్రతి మండలంలో అధునాతన చేపల మార్కెట్లు
మంత్రి తన్నీరు హరీశ్‌రావు
దేశాయిపల్లిలో ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
జమ్మికుంటలో డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ సహా వెయ్యిమంది పార్టీలో చేరిక
వీణవంక, సెప్టెంబర్ 8: బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని, ధరల భారం మోపుతూ.. నల్లచట్టాలు తెస్తూ ప్రజల నడ్డివిరుస్తుందే తప్ప ఆ పార్టీతో ఏం ప్రయోజనం లేదని, మనకు మాటలు చెప్పేవాళ్లు కాదు.. పనులు చేసేటోళ్లు కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్కారు చరిత్రలో నిలిచి పోయేలా అభివృద్ధి, సంక్షేమాన్ని చేపడుతూ ఆదర్శంగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం ఆస్తులు అమ్ముతూ.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. బుధవారం దేశాయిపల్లిలో ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంతోపాటు జమ్మికుంటలో డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ సహా వెయ్యి మంది టీఆర్ఎస్లో చేరికల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం ఇప్పుడు రైతుల వడ్లుకొనమని అంటున్నదని, ఏ పనిచేయని వాళ్లు ఓట్లు ఎలా అడుగుతరని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తోనే ముదిరాజ్‌ల బతుకులు మారాయని, మండలానికో అధునిక ఫిష్ మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించారు.
బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని, రాష్ర్టానికి ఏం చేసేందో చెప్పి ప్రజల్లోకి వస్తే బాగుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మనకు మాటలు చెప్పేవాళ్లు కాదని.. పనులు చేసేటోళ్లు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం దేశాయిపల్లి పీఎస్కే గార్డెన్లో బుధవారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రం రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందేనని, వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాక వ్యవసాయం పండుగలా మారిందని, సాగుకు పుష్కలంగా నీరందుతున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్‌లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం మోటార్ సైకిళ్లు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని మండిపడ్డారు. రూ.150 కోట్లతో లగేజ్ ఆటోలు, రూ.65 కోట్లతో హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్లెట్ వాహనాలు అందజేసినట్లు చెప్పారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రూ.వెయ్యి కోట్లు తేవాలి..
కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లను కొంతమంది పరిగె ఏరుకున్నట్లు అని విమర్శించారని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రూ.వెయ్యి కోట్లు తెలంగాణకు తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుందని, వీణవంకకు 24 గంటల దవాఖాన కావాలని అడిగిన వారంలోనే మంజూరు చేశామని తెలిపారు. బండ్లు వేసుకొని గ్రామాల్లో తిరగడం కాదని, వీణవంకలో ఓట్లు అడిగే ముందు బీజేపీ నాయకులు దొడ్డు వడ్లు కొంటామని కేంద్రంతో చెప్పించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లతో బతుకులు బాగుంటాయో.. సంక్షేమ పథకాలతో బతుకులు బాగుంటాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. మీటింగ్‌లకు పోకండి డబ్బులిస్తామని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారట.. ఇదెక్కడి న్యాయమో ఆలోచన చేయాలని కోరారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉందని, మీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమను బీసీ-బీ నుంచి బీసీ-ఏలో చేర్చాలని, ప్రతి మండలానికి సమీకృత చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులను కోరగా, నర్సింగాపూర్ నుంచి వీణవంక బ్రిడ్జి దాకా ఫోర్ లేన్ కావాలని టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి కోరగా, మంత్రి స్పందించారు. పాడి కౌశిక్‌రెడ్డి కోరిన విధంగా ఫోర్‌లైన్ వేపించి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్‌తో పాటు, మరికొందరు బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, కండువాకప్పి ఆహ్వానించారు.
మండలానికో ఆధునిక ఫిష్ మార్కెట్..
రెండు రోజుల్లో చెరువుల్లో, కుంటల్లో చేప పిల్లలు పోసే కార్యక్రమం ఉందని చెప్పారు. బీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ.6 లక్షల బీమా పాలసీ ఇస్తామని, త్వరలోనే 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చేప పిల్లలకు బదులు సొసైటీలకు డబ్బులు అందజేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. త్వరలోనే ప్రతి మండలానికి అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, ముదిరాజ్‌ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.