నాయీ బ్రాహ్మణులకు అండగా రాష్ట్ర సర్కారు
మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్‌లో నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
గెల్లు శ్రీనివాస్‌కు ఓటేస్తామని సంఘ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం
హుజూరాబాద్, సెప్టెంబర్ 8: టీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి, సంక్షేమమని, ఈటల రాజేందర్‌కు ఓటేస్తే ప్రగతి ఆగిపోతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేరొన్నారు. బుధవారం పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉప ఎన్నికల్లో ఏకతాటిపై నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 10గుంటల భూమితో పాటు రూ. 30లక్షలను ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆ భవన నిర్మాణానికి త్వరలో భూమిపూజ చేసుకుందామని చెప్పారు. బీసీల గురించి ఏనాడూ ఆలోచించలేదని, సంఘ భవన నిర్మాణానికి స్థలం కావాలని కోరినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నికార్సయిన బీసీ బిడ్డ అని, ఈటల పావలా బీసీనేనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో బీసీ అని చెప్పుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ హైదరాబాద్‌లో రెడ్డి పేరుతో చలామణీ అవుతారని ఎద్దేవా చేశారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు. నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు వ్యక్తిగత రుణాలను మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ వెంటే ఉంటాం..
సమావేశంలో భాగంగా నాయీబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఇక్కడ కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సిద్దిపేట మున్సిపల్‌చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొరేటర్ హరిశంకర్, నాయకులు గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, సంఘం నాయకులు బండారి శ్రీనివాస్, చక్రపాణి, టీ చంద్రయ్య, బండారి మహేశ్ ఉన్నారు.
ఉన్న బిల్డింగ్‌ను కూలగొట్టిండు
మేమంతా 20ఏండ్ల కింద చందాలు వేసుకుని హైస్కూల్గ్రౌండ్లో సంఘ భవనం కట్టుకున్నం. ఈటల రాజేందర్ ఇక్కడ సర్కారు దవాఖాన వస్తున్నదని చెప్పి కూలగొట్టించిండు. ఇదేందని అడిగితే మీ భవనం జాగా లేకపోతే దవాఖాన నిర్మాణానికి అనుమతి రాదన్నడు. అందరికోసం ఉపయోగపడేది కదా అని బిల్డింగ్ కూలగొట్టేందుకు ఒప్పుకొన్నం. మాకు మల్లా హైస్కూల్ గ్రౌండ్‌లోనే బిల్డింగ్ కట్టిస్తానని మాట ఇచ్చిండు. సారూ ఏమైందని అడిగితే పట్టించుకోలే. కనీసం రూ.5లక్షలు ప్రభుత్వ నిధులు ఇప్పించాలని వేడుకున్నా కనికరించలేదు. చేసేదేం లేక మా సంఘంలో ఉన్న కొద్దిపాటి పైసలతో పనులు ప్రారంభించినం. పైసల్లేక మధ్యలోనే పనులు ఆగిపోయినయ్. సంఘం భవనం పెద్దగా కట్టుకునేందుకు స్థలంతో పాటు రూ. 8లక్షలు కేటాయించినందుకు కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-జంపాల శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు
చెప్పులరిగేలా తిరిగినా ఇవ్వలే..
నాయీబ్రాహ్మణ సంఘ భవనం కావాలని ఈటల రాజేందర్ చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరిగినా ఏనాడూ పట్టించుకోలే. ఇయ్యలే. నాలుగుసార్ల మాతోని ఓట్లయితే వేయించుకున్నాడే తప్ప భూమి మాత్రం ఇచ్చేందుకు కనికరం చూపలేదు. టీఆర్ఎస్కు మద్దతుగా ఎన్నికల్లో ఉంటాం. తిన్నసోడును మరిచేది లేదు.
కేసీఆర్ సారు మా కల నెరవేర్చిండు
నాయీబ్రాహ్మణుల సంఘ భవనం కోసం స్థలం కేటాయించాలని ఏండ్ల సంది తిరుగుతున్నం. కానీ కేసీఆర్ సార్ మా కల నెరవేర్చిండు. జాగా. పైసలు ఇచ్చిండు. ఎన్నికలో ్ల గెల్లు శ్రీనివాసుకు ఓటేస్తాం. ఈటల రాజేందర్‌కు బుద్ధిచెబుతం. హుజూరాబాద్ అభివృద్ధిని ఈటల ఎప్పుడూ పట్టించుకోలే. ఆయన రాజీనామా చేసినంకనే పనులు వెంటనే జరుగుతున్నాయి.