పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములమవుదాం
మంత్రి గంగుల కమలాకర్ పిలుపు
బల్దియా ఆధ్వర్యంలో పది వేల మట్టి విగ్రహాల పంపిణీ
కార్పొరేషన్, సెప్టెంబర్ 8: భక్తిశ్రద్ధలతో మట్టి గణపతిని మనసారా పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురసరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయ ఆవరణలో మట్టి విగ్రహాలు, మొకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏటా వినాయక చవితిని పురసరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరపాలక సంస్థ ఇండ్లల్లో పూజించుకునేందుకు వేల కొద్ది మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేస్తున్నదన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గణపతితో పాటు ఒక మొకను కూడా బహూకరిస్తున్నామని, దానిని ఇంటి పరిసరాల్లో నాటుకొని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భక్తులు మండపాల ఏర్పాటు కోసం సీసీ రోడ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల రహదారులు బురదమయంగా మారాయని, అలాంటి ప్రాంతాల్లో డస్టు వేసి మరమ్మతులు చేయిస్తామన్నారు. నిమజ్జనం పాయింట్ల వద్ద నగరపాలక సంస్థ ద్వారా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేన్లలో నీరు నిలిచిందని, పంట నష్టం జరిగితే ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, ఇన్చార్జి కమిషనర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.