మతం పేరిట చిచ్చుపెట్టే పార్టీకి ఇక్కడ చోటే లేదు
ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో మనసోంటి పథకాలు అమలు చేస్తున్నరా..?
అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్
హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండానే ఎగురాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, ఆగస్టు 8: గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న బీజేపీ ఈ ఏడేళ్ల కాలంలో ప్రజలకు ఏం చేయలేదని.. మోదీ పాలనలో దేశం సర్వనాశనమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో మనసోంటి పథకాలు అమలు చేస్తున్నారా..? చెప్పాలని.. ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తారని ప్రశ్నించారు. అసలు ఆ బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో జమ్మికుంట, వరంగల్ తూర్పు, ధర్మపురి మున్సిపల్‌కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రజా వ్యతిరేకి మోదీ మధ్యనే అసలు, సిసలు పోటీగా అభివర్ణించారు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి ఇక్కడ స్థానం లేదన్నారు. అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఏ నాయకుడికి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు టీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, ఎప్పుడైనా గులాబీదే విజయమని దీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ గడ్డపై టీఆర్ఎస్ జెండాయే ఎగురాలని ఆకాంక్షించారు. ఇంటింటికీ పథకాలు, కార్యక్రమాలు తీసుకెళ్లాలని, టీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరింత శ్రద్ధ, అంకితభావంతో పనిచేసి టీఆర్ఎస్కు ఘన విజయం చేకూర్చుదామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ సారయ్య, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.
రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సేవలు
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో వైద్య సదుపాయాలు గొప్పగా ఏర్పాటు చేసుకున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రోగాల్లేని సమాజం కోసం సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే రూ.4వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆదివారం ఆయన జమ్మికుంట సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)ను సందర్శించారు. టీకాలు వేస్తున్న కేంద్రాన్ని పరిశీలించారు. దవాఖానలో నాల్గో తరగతి ఉద్యోగులు 30మందికి ఐదు నెలల జీతాలు రూ.6లక్షల విలువైన చెక్కులను అందించారు. ప్రతి ఉద్యోగికి అండగా ప్రభుత్వం ఉంటుందని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ సారయ్య, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ సుమన్, వైద్యులు, సిబ్బంది, తదితరులున్నారు.
మాటిచ్చిన 24గంటల్లోనే ట్రై సైకిల్
దివ్యాంగురాలికి మంత్రి ఈశ్వర్ అభయం ఇచ్చారు. మాట ఇచ్చిన 24 గంటల్లోనే బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్‌ను అందజేసి బాసటగా నిలిచారు. వివరాల్లోకి వెళితే రెండ్రోజుల క్రితం మంత్రి జమ్మికుంటలోని 23వ వార్డులో పర్యటించారు. ఓ ఇంటి ముందు కూర్చొని లేవలేని స్థితిలో ఉన్న 25 ఏండ్ల అమ్మాయి కనిపించింది. ఆమెను పలుకరించగా, ‘నా పేరు ఆస్మా.. నాకు పోలియో వల్ల లేవ లేను సార్..చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంటున్న’అని ఏడ్చింది. ‘నాకూ తిరగాలని ఉంది సార్.. బ్యాటరీ ట్రై సైకిలిప్పించండి..’అని విజ్ఞప్తి చేసింది. వెంటనే మంత్రి స్పందించారు. ట్రై సైకిల్ ఇప్పిస్తానని మాటిచ్చారు. అంతే 24గంటలు తిరగకముందే(18గంటల్లోనే).. ఆస్మా ఇంటి ముందుకు బ్యాటరీతో కూడిన ట్రై సైకిల్ వచ్చింది. స్వయాన మంత్రే ట్రై సైకిల్‌తో వచ్చారు. దివ్యాంగురాలు ఆస్మాకు అందించారు. ఆమె కోరిక నెరవేర్చారు. ఆసరాగా నిలిచారు. అంతే ఆస్మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ట్రై సైకిలెక్కి తిరిగింది. మంత్రికి థ్యాంక్స్ చెప్పింది. కుటుంబ సభ్యులతో పాటూ కాలనీవాసులు అమాత్యుడికి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేలు నరేందర్, చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, తదితరులున్నారు.