హుజూరాబాద్, ఆగస్టు 8: బీజేపీ అంటేనే ఒక ఝాటా పార్టీ అని, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు విమర్శించారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ అబద్ధపు ప్రచారం, హామీలతో గద్దెనెకాలని చూస్తున్నదని, ప్రజలు గమనించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కార్లు, బైక్‌లు ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత మొండి చెయ్యి చూపారని గుర్తు చేశారు. సోషల్ మీడియాల్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు పోస్టింగులు పెడుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మొగున్ని కొట్టి మొరమొర అన్న చందంగా ప్రజలకు తాయిలాలు ఇచ్చుకుంటూ టీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఈటల కుట్టు మిషన్లు, గడియారాలు, గ్రైండర్లు తదితర వస్తువులను ఓటర్లకు ఇచ్చాడనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ నాయకులు దిట్ట అని, వాళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏమిలేకనే సోషల్ మీడియాలో పక్కదారి పట్టించే పోస్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈటలకు ఓటెందుకు వేయాలో ఆయనే చెప్పాలని, ఆత్మగౌరవానికి, ఆస్తుల గొడవకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధమేమిటని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలను పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో బీజేపీ అధిష్టానానికే తెలియాలని సూచించారు. రాజేందర్ ఎక్కడా కూడా మోడీ, ఇతర బీజేపీ పెద్దల పేర్లు తీయకుండానే ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బీజేపోళ్లు సిగ్గుతో తల దించుకోవాలని విమర్శించారు. అంతే కాకుండా బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, కనీసం జై శ్రీరాం, భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలు కూడా ఈటల నోటి వెంట రాకపోవడం వెనుక ఆంతర్యమేమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏనాడూ ఈటల పాల్పడలేదని, కేవలం అందివచ్చిన పదవులను అడ్డుపెట్టుకొని ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకొన్నాడని ఆరోపించారు. ఆయన కోసమే ఆయన తప్ప నియోజకవర్గ ప్రజల కోసం ఈటల చేసింది శూన్యమే అని మండిపడ్డారు.
ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు
ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు లేదని, ఈ గడ్డ టీఆర్ఎస్కు అడ్డా అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపరిచింది నూటికి నూరుపాళ్లు ఈటల రాజేందరేనని స్పష్టం చేశారు. ఓట్లు దండుకునేందుకు ప్రలోభాలకు తెరలేపారని, ఉప ఎన్నికలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికలో తప్పకుండా గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్‌కు కానుకగా అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సానుభూతి కోసం వెంపర్లాట
ఈటల రాజేందర్ సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. కేవలం తన సానుభూతి కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నాడని, 17 ఏండ్ల తన పాలనలో సమస్యలు తెలుసుకునేందుకు ఎప్పుడైనా పాదయాత్ర చేశాడా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరిని పెట్టినా వందశాతం గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇస్తామని, ఇందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అభిమానులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
మీటర్లు పెట్టే బీజేపీకి మద్దతిస్తారా…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డామని, నిత్యం రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మేలా 24 గంటల కరెంటును తీసుకురావడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి 24గంటల కరెంటు సరఫరా చేస్తుంటే కేంద్రం మాత్రం మీటర్లు పెట్టాలని రాష్ర్టాలను ఒత్తిడి చేస్తున్నదని దుయ్యబట్టారు. చాటుమాటుగా వ్యవసాయంలో నల్లా చట్టాలు తెచ్చి రైతులను నడ్డీ విరిచే కుట్రలు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే జాతీయ హోదా ఎందుకు కల్పించలేదో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేటర్లు శ్రీనివాస్, బాలయ్య, కో ఆప్షన్ సభ్యులు నరేందర్, కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, నాయకుడు ప్రభాకర్ ఉన్నారు.