మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఖాసీంపేటలో రైతుబంధు సంబురాలకు హాజరు
గన్నేరువరం, జనవరి 8: రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఇందులో భాగంగానే రైతు బంధు పథకం అమలు చేస్తున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఖాసీంపేట గ్రామంలో శనివారం మండల రైతు బంధు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయనకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ గంప మల్లీశ్వరి డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎడ్ల బండిపై ఎమ్మెల్యే రసమయి రైతులతో కలిసి ఊరేగింపుగా రైతు వేదికకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రైతులు ఆయనకు రుణపడి ఉండాలన్నారు. అనంతరం మండలంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను ఘనంగా సన్మానించారు. రైతు బంధు సంబురాల్లో భాగంగా జంగపెల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. గన్నేరువరంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, ఎంపీటీసీ ఎలేటి స్వప్నాచంద్రారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.