కరీంనగర్ రూరల్, జనవరి 8: కరీంనగర్ మండలం బొమ్మకల్ బైపాస్‌లో గల వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ కళాశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా, సుమారు 60 మంది పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థులు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురేస్తూ, భోగి మంటలు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల అడిషనల్ డైరెక్టర్ బీ గోవిందరావు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు, పండుగల విశిష్టత గురించి తెలియజేసేందుకు కళాశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగ్గులపోటీలో పాల్గొన్న విద్యార్థినులకు కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేసింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీవీ సుధాకర్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ యూ మాధవి, మేచినేని పవన్‌రావు, అకౌంటెంట్ లక్ష్మణ్, కళాశాల హెచ్వోడీలు నాంపెల్లి స్టాలిన్, డీన్ ప్రదీప్‌కుమార్, రవికిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.