విద్యానగర్, జనవరి 8: పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆలయ ఫౌండేషన్‌ను స్థాపించారు. కలెక్టర్‌గా క్షణం తీరిక లేకుండా గడిపే ఆయన నిరుపేదల కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో దీనిని స్థాపించి సేవలందిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన కష్టపడి 2001లో ఐఏఎస్‌గా సెలక్టయ్యారు. మధ్యప్రదేశ్ క్యాడర్లో ఉత్తమ కలెక్టర్‌గా మూడుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 2014లో ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను నరహరి 20 మంది వలంటీర్లతో స్థాపించారు. నాటి నుంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 1500 మందికి పైగా కృత్రిమ కాళ్లు, కృత్రిమ చేతులు, ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, ఇయర్ హింగ్ డ్రమ్స్ అందజేశారు. ఒక్కో కృత్రిమ కాలుకు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుంది. వీటిని ఈ శిబిరాల్లో ఉచితంగా అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌లోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమ శిబిరానికి 800 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
శిబిరం ఆలయ ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి, హైదరాబాద్ సహకారంతో ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు, ఐఏఎస్ పీ నరహరి ఆదేశాల మేరకు ఉచితంగా జైపూర్ ఫుట్ టెక్నాలజీతో తయారు చేసిన కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పద్మశాలీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ శిబిరం 7, 8, 9 తేదీల్లో కరీంనగర్లో కొనసాగుతుండగా, పది జిల్లాల నుంచి దివ్యాంగులు హాజరవుతున్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ అవయవాలను అందజేస్తున్నారు. ఏమైనా హైరిస్క్ ఉంటే హైదరాబాద్‌లో అందజేస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. శిబిరంలో 25 మంది నిష్ణాతులతో కృత్రిమ కాళ్లను అందజేస్తున్నారు. 040-29800551 నంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. అలాగే bmvsshyd1@gmail.com, వెబ్సైట్ www.jaipurfoot.org లో సంప్రదించవచ్చన్నారు. శనివారం నాటి శిబిరంలో పద్మశాలీ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, పోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారికి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
నిస్వార్థంగా సేవలందిస్తున్నాం
ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందిస్తున్నాం. ఐఏఎస్ అధికారి నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, విద్యార్థులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది.