కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల పంపిణీ
విద్యానగర్, జనవరి 8: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఆర్టీసీ వర్‌షాప్ సమీపంలోని పద్మశాలీ భవన్లో ఆలయ ఫౌండేషన్ ద్వారా శనివారం దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేయగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. అనంతరం కృత్రిమ కాళ్ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బసంత్‌నగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ ఫౌండేషన్ ద్వారా కృత్రిమ అవయవాలు ఉచితంగా అందించడం దివ్యాంగులకు గొప్ప వరమన్నారు. హైదరాబాద్‌కు చెందిన భగవాన్ మహవీర్ వికలాంగుల సహాయ సమితి సహకారంతో ఉచితంగా జైపూర్ ఫుట్ తయారు చేస్తున్న కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు పంపిణీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ కమిషనర్ అండ్ కార్యదర్శి పరికిపండ్ల నరహరి తన తండ్రి సత్యనారాయణ సంస్మరనార్థం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేయడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల కాళ్లు, చేతుల కొలతలను తీసుకుని ఇకడే కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న భగవాన్ మహవీర్ వికలాంగుల సహాయ సమితి నిర్వాహకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, ఆలయ ఫౌండేషన్ సీఈవో టీ రమేశ్, డిప్యూటీ సీఈవో మిట్టపల్లి రాజేంద్రకుమార్, తిరుపతి, శ్రీనివాస్, శ్రీనివాస్, కే నాగార్జున తదితరులు పాల్గొన్నారు.