బండి సంజయ్‌కు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం సూటి ప్రశ్న
ప్రజల బాగోగులు పట్టించుకోని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తీవ్రవాద సంస్థలు
కరోనా నిబంధనలు అతిక్రమించి కేంద్ర నాయకుల పర్యటనలా?
కోటి ఉద్యోగాల వాగ్దానం ఏమైంది?
తెలంగాణచౌక్, జనవరి 8: ఎంపీగా ఎన్నికై రెండున్నరేళ్ల కాలంలోనే బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు రూ.700 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో? ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతానని ప్రకటనలు చేస్తున్న బండి సంజయ్ 2019 వరకు కార్పొరేటర్ మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రూ.రెండు కోట్ల ఆస్తి కూడా లేని మధ్యతరగతి కుంటుంబం నుంచి రాజకీయాలకు వచ్చి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగానే వందల కోట్ల సంపాదనతోపాటు చానల్‌కు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. జైలుకు ఎవరు వెళ్తారో? త్వరలోనే తెలుస్తుందని, బీజేపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ ప్రజల బాగోగులు పట్టించుకోకుండా వారిని నాశనం చేసే ఉగ్రవాద సంస్థలని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా అధికారం దాహంతో ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కరోనా మూడో దశ దేశంలో మొదలవుతున్నదని, రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా సమయంలో దీక్ష ఎలా కొనసాగిస్తారని మండిపడ్డారు. చట్టాల ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తప్పు ఒప్పుకోవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని హామీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల బాగు కోరుకునే ఎంపీ అయితే ఎలా దీక్ష చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్కూరి సన్ని, జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, మహిళా అధ్యక్షురాలు స్వరూప, నాయకులు ప్రభాకర్, చంద్రమౌళి, తాండ్ర శంకర్, అంబాల రాజయ్య పాల్గొన్నారు.