
ఆయన వెంటే వేలాది మంది అభిమానులు
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకే : లక్ష్మీనరిసింహారావు
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు తండ్రి ఆనందరావు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనరసింహారావు ఆ తర్వాత కాంగ్రెస్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి జీవం పోయడమేకాదు, పార్టీని కాపాడడంలో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, కుట్రలు, కుతంత్రాలు కొనసాగినా.. ఆయన మాత్రం అవేవి పట్టించుకోకుండా పార్టీ శ్రేణులకు రక్షణగా నిలుస్తూ వచ్చారు. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ వారే తనను ఓడించడానికి ఆనాడు కుట్రలు పన్నారని స్వయంగా చల్మెడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా, ఒక సాధారణ కార్యకర్త నుంచి తన రాజకీయ ప్రస్థానం ఆరంభించిన చల్మెడ, మొన్నటి వరకు పీపీసీ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు.
నిబద్ధత.. సేవాభావం
చల్మెడ రాజకీయ జీవితమే కాదు, వ్యాపార రంగంతోనూ ప్రత్యక్ష సంబంధాలున్నాయి. చల్మెడ అనందరావు వైద్య విజ్ఞాన సంస్థతోపాటు పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నా.. ఆయన నిజజీవితంలో నిబద్ధతతో వ్యవహరిస్తారన్న మంచి పేరున్నది. ఇదే సమయంలో వ్యాపారానికి, రాజకీయాలకు ఆయన ఏనాడూ ముడిపెట్టలేదన్న అభిప్రాయాలున్నాయి. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని.. ఆ పార్టీలో ఎన్నో సంఘనటలు జరిగినా.. ఆయన ఏనాడు ఇతరులపై విమర్శలు చేయలేదు. స్వయంగా ఆయనకు నష్టం వాటిల్లే విధంగా కొంత మంది కుట్రలు, కుతంత్రాలు చేసినా అన్నింటినీ భరిస్తూ వచ్చారే తప్ప.. విమర్శలకు పూనుకోలేదు. దీంతోపాటు ఆయనకు సేవాభావ దృక్పథం ఉన్నది. ఆలిండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తల్లి జానకమ్మ పేరుతో ట్రస్టు నడుపుతున్న లక్ష్మీనరసింహారావు, తన స్వగ్రామం అయిన కోనరావుపేట మండలం మల్కపేటలో ప్రభుత్వ బడిని నిర్మిస్తున్నారు. అలాగే దేవాలయాన్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇవేకాకుండా, కరీంనగర్లోనూ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు చేయూత నిచ్చారు.
కాంగ్రెస్‌కు భారీ షాక్..
నిబద్ధత, నిజాయితీ నాయకుడిగా పేరున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయత్వంలో తొక్కివేసే తత్వాలు కొనసాగుతున్న ఆయన మాత్రం ఏనాడూ జడువ లేదు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇన్నాళ్లూ ఆయన తన శక్తి మేరకు ఆ పార్టీని కాపాడుతూ వచ్చారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనేక సభలు, సమావేశాల్లోనూ పార్టీలోని లొసగులను ఆయన వేదికపైనే ఎత్తి చూపారు. ముక్కుసూటిగా ఉండే.. ఆయన నాయకుల పనితీరు, లోపాలను, అంతర్గత కలహాలను బాహాటంగానే ఎత్తి చూపేవారు. అయినా వారిలో మార్పు కనిపించలేదు. కానీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెందినట్లు తెలుస్తున్నది. దీంతో పాటు టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ దార్శనికత, స్వరాష్ట్రంలో పురుడు పోసుకున్న విప్లవాత్మక పథకాలు, కండ్ల ముందే కనిపిస్తున్న ఫలాలు వంటివి తనను ఆకర్షించాయని చల్మెడే స్వయంగా వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్న విషయాన్ని గుర్తించారు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న చల్మెడ గులాబీ పార్టీలో నేడు చేరాలని నిర్ణయించుకున్నారు.
వేలాదిగా తరలివెళ్తున్న శ్రేణులు..
టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చల్మెడ స్వయంగా ఈ నెల 6న వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కారణాలను వివరించారు. దీనికి ముందుగానే.. చల్మెడ తనకు ఆది నుంచీ అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, సన్నిహితులతోపాటు వివిధ వర్గాలనుంచి అభిప్రాయం తీసుకున్నారు. వారంతా కూడా మూకుమ్మడిగా టీఆర్ఎస్కు వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చల్మెడ వెంట టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వేలాది మంది ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వెళ్తున్నారు. ఎక్కడికక్కడే సంబంధిత నాయకులే వాహనాలు సమకూర్చుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోనూ తనకు పెద్ద మొత్తంలో పరిచయాలుండడంతో వారు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కాగా, తాను బేషరతుగానే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామి కావడం, అధిష్టానం చెప్పిన పనిచేయడమే తన ప్రథమ లక్ష్యమని చల్మెడ పేర్కొన్నారు.