
కలెక్టరేట్, డిసెంబర్ 7: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని మూడు పోస్ట్‌మెట్రిక్, 9 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో 508 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు మొత్తం వసతి గృహాలను సందర్శించి సదుపాయాలను పరిశీలించాలన్నారు. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, కిటికీలకు వైర్‌మెష్, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ కనీస సౌకర్యాలు ఉన్నాయో.. లేదో పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మెనూ తప్పనిసరిగా పాటించాలని, హాస్టళ్లకు కావాల్సినవి ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, ఎస్సీ అధికారి కే భాస్కర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీఈ సమ్మిరెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన సమావేశమై, మాట్లాడారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికీ 31,974 మంది రైతుల నుంచి 1,87 ,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 1,78,859 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గోడౌన్లకు తరలించగా, మిగులు ధా న్యాన్ని వెంటనే తరలింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూ.366.81 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేయగా, 18,315 మంది రైతులకు రూ.207.56కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 23,311 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగులు రైతుల ట్రక్షీట్ల వివరాలు ఆన్లైన్లో నమోదు పూర్తి చేసి, ధాన్యం డబ్బులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో టీ శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీటీవో కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహం పరిశీలన
వేములవాడ, డిసెంబర్ 7: వేములవాడ పట్టణంలోని బాలికల వసతి సంక్షేమ గృహాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, వార్డెన్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.