
శంకరపట్నం, డిసెంబర్ 7 : ఈ యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కన్నాపూర్, రాజాపూర్, కరీంపేట్, ఇంగాపూర్, చింతలపల్లి, అర్కండ్ల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని కోరారు. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయదని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని వెల్లడించారు. కావున రైతులు వరికి బదులుగా పెసర, మినుము, వేరుశనగ, బబ్బెర, శనగ, నువ్వులతోపాటు కూరగాయలు పండించాలని సూచించారు. సీడ్ వరి వేసే రైతులు ముందుగానే ఆర్గనైజర్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరు తడి పంటలపై అవగాహన కల్పించే సీడీని రైతులతో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆత్మ బీటీఎం సునీల్, ఏఈతోలు శైలజ, రాజ్‌కుమార్, సుమాంజలి, సునంద, రజనీకాంత్, లక్ష్మీప్రసూన పాల్గొన్నారు.
ఇతర పంటల వైపు మొగ్గు చూపాలి
గన్నేరువరం, డిసెంబర్ 7 : యాసంగిలో ఎఫ్‌సీఐ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోనని ప్రకటించిందని, దీంతో రైతులు వరిని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దీనిని అధిగమించడానికి రైతులు ఇతర పంటల సాగువైపు మొగ్గు చూపాలని ఏవో కిరణ్మయి సూచించారు. మండల కేంద్రంలో రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ, ఇతర పంటలుగా మొక్కజొన్న, జొన్న, పెసర, మినుములు, కందులు, శనగలు, వేరుశనగ, కుసుమ, నువ్వులు పండించాలని తెలిపారు. ఇతర పంటల సాగులో యాజమాన్య పద్ధతులను వివరించే పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, ఏఈవో ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు
చిగురుమామిడి, డిసెంబర్ 7: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయడమే రైతులకు లాభదాయకమని మండల వ్యవసాయాధికారి రంజిత్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చిన్న ములనూరు గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరుతడి పంటలకు సంబంధించిన పలు అంశాలను రైతులకు వివరించారు. పొద్దుతిరుగుడు కంది పెసర, వేరుశనగ, శెనగ నువ్వులతోపాటు కూరగాయలు సాగుపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన శాఖాధికారి మంజువాణి పట్టుపరిశ్రమ అధికారి రాజనరేంద్ర వ్యవసాయ విస్తరణాధికారి బొల్లం సౌజన్య, రైతులు పాల్గొన్నారు.