ధర్మారం, నవంబర్ 7: సమైక్యపాలనలో అరిగోస పడ్డ ఆయకట్టేతర రైతుల చిరకాల స్వప్నం స్వరాష్ట్రంలో సాకారం కానున్నది. శ్రీరాంసాగర్ డీ 83/బీ1 ఎల్ కెనాళ్లకు అనుబంధంగా ఉప కాల్వలు నిర్మించాలని ధర్మారం మండలంలోని కొత్తపల్లి, పత్తిపాక, బొమ్మారెడ్డిపల్లి గ్రామాల రైతులు అప్పటి సీమాంధ్ర పాలకుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. అయినా వారు కనికరించలేదు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విన్నపం మేరకు ప్రభుత్వం రూ. 19.04కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉప కాల్వల నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన చేయనున్నారు.
వానలు, బావులే ఆధారం..
బొమ్మారెడ్డిపల్లి, పత్తిపాక, కొత్తపల్లి గ్రామాలు నాన్ కమాండ్ ఏరియాలో ఉన్నాయి. 2001లో అప్పటి సర్కారు మల్లాపూర్ 1ఎల్ కాల్వకు అనుబంధంగా బొమ్మారెడ్డిపల్లి వరకు ఉప కాల్వ తవ్వి మధ్యలోనే వదిలేశారు. దీంతో ఈ మూడు గ్రామాల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కేవలం వానకాలం సీజన్లో వర్షాలు, వ్యవసాయ బావుల ఆధారంగా పంటలు పండించాల్సిన పరిస్థితి. యాసంగిలో భూములను పడావుపెట్టాల్సిన దుస్థితి. ఉప కాల్వలు నిర్మించాలని ఎన్నోసార్లు ఈ గ్రామాల రైతులు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.
మంత్రి చొరవతో నిధులు మంజూరు..
ఎస్సారెస్పీపై ఉప కాల్వలు నిర్మించాలని మంత్రి ఈశ్వర్ పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయకట్టేతర గ్రామాల్లో కాలి నడకన పర్యటించి రైతుల ఇక్కట్లను తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ ఇంజినీరింగ్ అధికారులతో త్వరితగతిన సర్వే చేయించారు. నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీంతో సర్కారు గతేడాది ఏప్రిల్‌లో రూ.19.04 కోట్లు మంజూరు చేసింది.
1,052 ఎకరాలకు సాగునీరు
కొత్త కాల్వల నిర్మాణంతో 1,052 ఎకరాలకు సాగునీరు అందనున్నది. పత్తిపాకలో 300 ఎకరాలకు, బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 752 ఎకరాలకు నీరు రానున్నది. అయితే కాల్వల నిర్మాణంలో పత్తిపాకలో 27.39 ఎకరాలు, మల్లాపూర్‌లో 20.34, బొమ్మారెడ్డిపల్లిలో 31.35, కొత్తపల్లిలో 12.09 ఎకరాలు రైతులు భూములు కోల్పోతున్నారు. ఇందులో కాల్వ మార్గాన్ని రెండు భాగాలుగా విభజించారు. పత్తిపాక కాల్వ నిర్మాణానికి 48.33 ఎకరాలు, కొత్తపల్లి కాల్వ నిర్మాణానికి 44.04 ఎకరాలు మొత్తంగా 92.37 ఎకరాల భూములు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శంకర్ కుమార్, తహసీల్దార్ వెంకటలక్ష్మి, పత్తిపాక, కొత్తపల్లి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి చర్చించారు. త్వరలో పరిహారం చెల్లింపు ప్రక్రియ కొలిక్కిరానున్నది.
కాల్వల నిర్మాణం ఇలా..
మల్లాపూర్‌లోని ఎస్సారెస్పీ డీ83/బీ 1ఎల్ ఉపకాల్వకు అనుబంధంగా మైనర్లు, సబ్ మైనర్ కాల్వలు నిర్మించనున్నారు. 1ఎల్ కాల్వ 1.420 కి.మీ వద్ద తవ్వకం మొదలై మల్లాపూర్, పత్తిపాక శివారుల ద్వారా 3.450 కిలో మీటర్ల కాల్వను తవ్వి భైరోని చెరువుకు అనుసంధానిస్తారు. అదే విధంగా ఇదే 1ఎల్ కాల్వకు అనుబంధంగా బొమ్మారెడ్డిపల్లి శివారులోని నాగులు చెరువు శివారు నుంచి రెండు ఉప కాల్వలను నిర్మిస్తారు. ఒక మార్గంలో ఎడమవైపు 3ఎల్ ఉప కాల్వను బొమ్మారెడ్డిపల్లి శివారు నుంచి కొత్తపల్లి శివారు 2.750 కిలో మీటర్ల పొడవు కాల్వ తవ్వి కంది లొద్దికి అనుసంధానిస్తారు. మరోమార్గంలో కుడివైపు 3ఎల్-1ఆర్ కాల్వను బొమ్మారెడ్డిపల్లి శివారు నుంచి కొత్తపల్లి శివారు వరకు 2.250 కిలో మీటర్ల కాల్వను తవ్వి ఒక కుంటకు అనుసంధానిస్తారు. ఈ లెక్కన మొత్తం 8.45 కిలో మీటర్ల దూరం పాటు కొత్త కాల్వలను నిర్మిస్తామని నీటి పారుదల శాఖ పెద్దపల్లి ఈఈ ప్రసాద్, ఏఏఈ నరేశ్ వెల్లడించారు.