ధర్మపురి, నవంబర్7: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ధర్మపురి క్షేత్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆలయం అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో యాదాద్రి తరహాలో టెంపుల్ సిటీగా మారుస్తామని పేర్కొన్నారు. ఆదివారం గోదావరికి హారతినిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నదీమతల్లిని కోరుకున్నట్లు తెలిపారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదనేది భక్తుల ప్రగాఢ నమ్మకమన్నారు. ఇక్కడి గోదావరిలో మురుగునీరు కలుస్తుండడంతో భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా రూ. 6కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో గోదావరి పొడవునా 2 కిలోమీటర్ల మేర మహాడ్రైనేజీ నిర్మించామన్నారు. సమీప భవిష్యత్‌లో మోరెళ్ల వాగు నీరు కలిసే చోట నీటిశుద్ధ్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నది ఒడ్డున రూ. కోటి వెచ్చించి అధునాతన వైకుంఠధామం నిర్మించామని పేర్కొన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నర్సింహాస్వామి, యమ ధర్మరాజు ఆలయాలను పునర్మిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. సత్యవతి దేవాలయంతోపాటు ఇసుక స్తంభాన్ని ఆధునీకరిస్తామని వెల్లడించారు. పుట్టబంగారం సేకరణ స్థలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కోనేరుకు సాలాహారం దారి వెడల్పు పనులు చేపడతామన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద మరో 60 గదులు, టీటీడీ ధర్మశాల వద్ద మరో 100 గదులు నిర్మిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై రాయపట్నం, తుమ్మెనాల వద్ద స్వాగత తోరణాన్ని నిర్మిస్తామన్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఏల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశం, ఆలయ సీఈవో సంకటాల శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, నాయకలు చిలువేరు శ్యాంసుందర్, ఆకుల రాజేశం ఉన్నారు.