కరీంనగర్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు కలుగకుండావేగవంతం గా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ.116.14కోట్ల విలువైన 59,256 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, ఇప్పటివరకు 32.50 లక్షల గన్నీ బ్యాగులను కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. ఇంకా 26,75,291 గన్నీ బ్యాగులు వివిధ గోదాముల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లు వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు సహకరించాలని కోరారు. రైతులు ఆరబెట్టి, శుభ్రం చేసిన ధాన్యాన్నే కేంద్రాలకు తేవాలని, అప్పుడే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్, కార్యదర్శి అన్నమనేని సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.