పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 7: క్వింటాల్ పత్తి కనీస మద్దతు ధర రూ. 6025 కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పత్తి కొనుగోలు, మద్దతు ధర, తేమ శాతం తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉందని, అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, ఒకవేళ ప్రైవేట్ వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే తక్కువ చేస్తే సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని వివరించారు. పత్తిని విక్రయించే సమయంలో 8-12 తేమ శాతం మాత్రమే ఉండాలని, గన్నీ సంచుల్లో పత్తిని తీసుకురావడంతో నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. పత్తిలో 8శాతం తేమ ఉంటే రూ. 6025, 12శాతం తేమ ఉంటే రూ. 5784 ధర చెల్లిస్తారని వెల్లడించారు. జిల్లాలో 63,255 ఎకరాల్లో పత్తి సాగు అయిందని, దాదాపు 6 లక్షల క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చే వచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిన్నింగ్ మిల్లులు, ఇతర కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పరిశీలించి, వాటి పని తీరుపై తూనికల కొలతల శాఖ అధికారి, అగ్ని మాపక పనితీరుపై అగ్ని మాపక అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం పత్తి కొనుగోలుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అననపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, ఏసీపీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.