వంట గ్యాస్‌పై కేంద్రం బండబాదుడు
పండుగ పూట పెంపు
రెండేండ్లలోధర రెట్టింపు
ప్రస్తుతం రూ.వెయ్యికి చేరువ
మండిపడుతున్న మహిళలు
బతుకమ్మ వేళ నిరసన పాటలు
హుజూరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ, దసరా.. రాష్ట్రంలో ప్రజలు ఘనంగా జరుపుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది.. ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నది.. కానీ, కేంద్రం మాత్రం పేదల ఇంట గ్యాస్ మంట పెట్టి గోసపెడుతున్నది.. పండుగ, పబ్బం ఏమీ పట్టకుండా వంట గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెంచుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపుతున్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఏడేండ్లలో సిలిండర్ ధరను రూ.414 నుంచి రూ.956కు పెంచింది. ఇదే సమయంలో సబ్సిడీని రూ.200 నుంచి రూ.40కి తగ్గించగా, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆడబిడ్డలు మండిపడుతున్నారు. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మ వేళ నిరసన పాటలతో మండిపడుతున్నారు.
ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను చూపుతూ ఇష్టారాజ్యంగా పెంచుతున్నది. ముడిచమురు ధరలు తగ్గినప్పుడు దాన్ని అమలు చేయకుండా భారం మోపుతూనే ఉన్నది. సమయం సందర్భం లేకుండా.. పండుగ, పబ్బం లేకుండా వాత పెడుతున్నది. గడిచిన మూడు నెలలుగా చూస్తే.. జూలైలో రూ.25.50, ఆగస్టులో రూ.25, సెప్టెంబరులో రూ.25 చొప్పున పెంచింది. అక్టోబర్ అంటే.. ఈ వారంలోనే ఒకేసారి ఏకంగా రూ.15 పెంచింది. మొత్తంగా ఏడేండ్లలో వంట గ్యాస్ ధర రూ.414 నుంచి రూ.956కు చేర్చింది. ఈ కారణంగా పేదలపై భారం పడుతున్నది. నలుగురి కంటే ఎక్కువగా ఉండే కుటుంబంలో సగటున నెలకో సిలిండర్ అయిపోతుండగా, ప్రతి నెలా సగటున వెయ్యి రూపాయలు భరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో పేదలు మళ్లీ సిలిండర్ తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎంతో మంది గ్యాస్ బుడ్డిని పక్కన పెడుతున్నారు. మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు. ఈ దుస్థితి తెచ్చిన బీజేపీపై పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే పేద, మధ్యతరగతి ప్రజలు బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బీజేపీ మనకద్దని, సంక్షేమం వైపు నడిపిస్తున్న టీఆర్ఎస్కు అండగా ఉంటామని చెబుతున్నారు.
..పై చిత్రంలో వంట చేస్తూ కనిపిస్తున్న మహిళ పేరు పాతకాల ప్రమీల. ఊరు జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపూర్. భర్త మల్లయ్య. ఇద్దరు ఆడపిల్లలు. భార్యాభర్తలిద్దరూ కూలీలే. నిత్యం వీరిద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటేనే ఇల్లు గడుస్తున్నది. నోట్లోకింత బువ్వ పోతున్నది. ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరల పెంపు కుటుంబానికి గుదిబండగా మారింది. సిలిండర్‌ను బుక్ చేయడం భారమైంది. దీంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయింది. గురువారం ఇలా ఇంటి ముందు వంట చేస్తూ కనిపించింది. కట్టెల పొయ్యిపైన వంట చేస్తున్నారని అడిగతే.. తన బాధను వెల్లబోసుకున్నది. గంతంలో గ్యాస్ ధర తక్కువగా ఉండేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మస్తు పెరిగిందని చెబుతున్నది. రెండు రోజుల క్రితం కూడా మళ్లీ ధర పెంచారని ఆవేదన వ్యక్తం చేసింది. మాలాంటోళ్లు వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తరని ప్రశ్నిస్తున్నది. ఇంకా ఆసరా పింఛన్ల మీద బతికే ముసలోళ్లు వెయ్యి పెడుతారా..? అని మండిపడింది. పేదోళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కయితని చెబుతున్నది. ధరలు పెంచే బీజేపీ మనకెందుకని గరంగరమైంది.