ఈటల తీరుపై అసంతృప్తి సెగలు
స్థానిక నేతలను పట్టించుకోని రాజేందర్
నేతల మధ్య కుదరని సయోధ్య..
ప్రకంపనలు సృష్టిస్తున్న పట్టణాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం
హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 7: హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈటల రాజేందర్ శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా ఈటల పార్టీలోకి వచ్చారని, ఆయన కిషన్‌రెడ్డి మనిషని, అందుకే ఈటలను బండి సంజయ్ పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో అధిష్టానం సైతం ఆయన్ను లైట్‌గా తీసుకున్నట్లు వినిపిస్తున్నది.
సొంత ఎజెండాతో ముందుకు..
ఈటల పార్టీని, కార్యకర్తలను ఏమాత్రం నమ్మకుండా తన సొంత ఎజెండాతో ప్రచారంలో ముందుకు పోతున్నారని బీజేపీ శ్రేణులను ప్రచారంలో వెలుగులోకి రాకుండా చూస్తున్నారని పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. దీనివెనుక మతలబు వేరే ఉందని ఆరోపిస్తున్నారు. ప్రచారంలో.. ప్రచార సభలోగానీ పార్టీ పేరు, మోడీ పేరును ప్రస్తావించకపోవడంతో తన ఎజెండా వేరే ఉందని చెబుతున్నారు. ఆయనకు బీజేపీలో చేరిన ఫీలింగే లేదని, ఆయనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఏదైనా కార్యక్రమం పెడదామన్నా..? ఎందుకు..? అవసరం లేదు..? అంటున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడే ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయన, భవిష్యత్తులో తమకు ఏకువోయి మేకు అవుతాడని కాషాయ రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈటల కదలికలపై బీజేపీ అధిష్టానం పకడ్బందీ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈటల ఓటమి దాదాపుగా కన్ఫామ్ అయినట్లేనని, ఆయన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్న మాట వాస్తవమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని జిల్లా స్థాయి నాయకుడు ఒకరు వెల్లడించారు.
ప్రకంపనలు సృష్టిస్తున్న సస్పెన్షన్ వ్యవహారం
హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గురువారం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రెస్‌మీట్, ప్రెస్‌నోట్ ద్వారా ప్రకటించించడం శ్రేణులను విస్మయానికి గురిచేసింది. మహేందర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ముఖ్య అనుచరుడు. ఆయన్ను కావాలనే సస్పెండ్ చేశారని, దీని వెనుక పెద్ద కుట్రనే ఉందని పట్టణానికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. సస్పెన్షన్‌తో చాలామంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.