వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు జడ్పీ చైర్పర్సన్ స్పష్టీకరణ
జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా
కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలు కోరం లేక వాయిదా పడ్డాయి. శుక్రవారం జరుగాల్సిన ఈ సమావేశాలకు అధికారుల తప్పా కమిటీల చైర్మన్లు, సభ్యులు హాజరు కాలేదు. దీంతో సమావేశాలు ప్రారంభించాల్సిన సమయం వరకు వేచి చూసిన జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కరోనా నేపథ్యంలో సభ్యులెవరూ హాజరు కానందునా సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశాలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం తన చాంబర్లో జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి జడ్పీ చైర్పర్సన్ విజయ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత మూడు నెలల్లో జరిగిన ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకరపట్నం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వైద్య విధాన పరిషత్ అధికారుల తీరు బాగా లేదని ధ్వజమెత్తారు. అత్యవసర కేసుల్లో తాను ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా ఎత్తడం లేదని వాపోయారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఉన్న పీహెచ్‌సీలు, ఇతర దవాఖానల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయమై జడ్పీ చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ, ఇటీవల హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ దవాఖానలో ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణిపై వైద్యులు నిర్దయగా వ్యవహరించారని, కనీసం స్లైన్ కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేశారని మండి పడ్డారు. దీంతో ఆమె బంధువులు ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ఇంత మంచి సదుపాయాలు కల్పిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగం అవుతున్నాయన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన పనితీరు కూడా మారాలని, ఆపద సమయంలో వచ్చిన రోగులను కనీసంగానైనా పట్టించుకోవడం లేదని, సిబ్బంది కొందరు సెల్ ఫోన్లలో ఆడుకుంటూ కూర్చుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక ముందు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియాను జిల్లాలో కరోనా పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ జువేరియా మాట్లాడుతూ, జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్ లక్ష్యానికి మించి చేశామని, రెండో డోసు కూడా పూర్తి కావస్తోందని తెలిపారు. ప్రస్తుతం టీనేజర్స్‌కు టీకాలు వేస్తున్నామని, శరవేగంగా ఈ ప్రక్రియ నడుస్తోందని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా విస్తృతి నియంత్రణలోనే ఉన్నదని, భయపడాల్సిన పని లేదని, జాగ్రత్తలు తప్పని సరి తీసుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవోతోపాటు మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.