వెల్గటూర్, జనవరి 7 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని పైడిపల్లిలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదట రూ.26 కోట్లతో అన్ని హంగులతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని సర్పంచ్ గంగుల నగేశ్, మాజీ జడ్పీటీసీ గంగుల పద్మ అశోక్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వికలాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేశారు. ఎస్సీ మాదిగ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. వైకుంఠధామం, మాల కమ్యూనిటీ హాల్, పల్లె ప్రకృతివనం, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. కుమ్మరి, పద్మశాలీ, యాదవ సంఘం కమ్యూనిటీ భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలను విని అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామ అభివృద్ధికి రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నామని, మరో రూ.25 లక్షలతో కొత్త పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎస్సీ కులాల వారికి త్వరలో డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్, జూట్ బ్యాగుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ల కోసం గ్రూపులను తయారు చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి అధికారితో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, వైస్ ఎంపీటీసీ కవిత, ఎంపీటీసీ మల్లేశ్వరి, సర్పంచులు మెతుకు స్వరూప స్వామి, మారం జలేంధర్‌రెడ్డి, కంది విష్ణులావణ్య, బోడకుంటి రమేశ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, నాయకులు కృష్ణారెడ్డి, రాంరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, చల్లూరి రాంచందర్ గౌడ్, పాక వేణు, కాంతయ్య, చుంచు మల్లేశ్, భాస్కర్, సత్యం, రాజేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.