ఊరూరా సంబురాలు
పలుచోట్ల ముగ్గుల పోటీలు
కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వారోత్సవాలతో ప్రతి పల్లె మురిసిపోతున్నది. పెట్టుబడి కష్టాలు తీర్చిన ఈ పథకాన్ని రైతాంగం వేనోళ్ల కొనియాడుతున్నది. ఎనిమిది విడుతల్లో యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టుబడి కష్టాలు తీర్చిన రాష్ట్ర సర్కారుకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నది. వాడవాడనా సీఎం కేసీఆర్ చిత్రపటాలతో ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహిస్తూ.. పాలాభిషేకాలు చేస్తున్నది. మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుండగా అధికార యంత్రాంగం మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు అందజేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో రైతుబంధు సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి, రాములపల్లి గ్రామాల్లో జరిగిన సంబురాలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంతో పాటు మండలంలోని మాదాపూర్, జోగిన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన సంబురాలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్లో జరిగిన వేడుకల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో అధ్యక్షురాలు ఎలుక అనిత ఆంజనేయులు ఆధ్వర్యంలో మార్కెట్ సిబ్బందికి కొత్త బట్టలు పెట్టి సన్మానించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పత్తి అభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండలంలో ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వేములవాడ మార్కెట్ కమిటీ, శాత్రాజుపల్లె రైతు వేదికలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, 20 మంది రైతులను సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, కిష్టంపేట, మల్యాల గ్రామాల్లో జరిగిన వారోత్సవాల్లోనూ ఎమ్మెల్యే దాసరి పాల్గొన్నారు. పెగడపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. కమాన్‌పూర్ మండలకేంద్రంలో జరిగిన సంబురాల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హాజరయ్యారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ తీసి, రైతువేదిక వద్ద కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రూపాయి అప్పులేకుంట ఎల్లదీస్తున్న..
బాకీలు తెచ్చి ఎవుసానికి పెట్టుబడి పెడితే బర్కత్ ఉండేది కాదు. వారసత్వంగా మా తండ్రి వద్ద నుంచి నాకు నాలుగున్నర ఎకరాల భూమి అచ్చింది. ఎకరంన్నరలో వరి, రెండు ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో ఎకరంలో ఇతర పంటలు సాగు చేత్తున్న. ఇంతకు ముందు పెట్టుబడి సమయం వచ్చిందంటే పానం అగులుబుగులయ్యేది. ఇల్లు గడవడం కష్టమయ్యేది. అప్పులయ్యేటియి. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ సారు రైతు బంధు ఇస్తండో అప్పటి సంది కష్టాలు తప్పినై. పానం నిమ్మలంగా ఉంటంది. నాకు పసలుకు రూ.22,500 చొప్పున ఇప్పటిదాకా ఎనిమిది విడుతలకు రూ.1,79,500 అచ్చినయి. వీటిని మొత్తం పెట్టుబడులకే వాడిన. రూపాయి అప్పు లేకుంట ఎల్లదీస్తున్న. రైతు బంధు అచ్చినకాన్నుంచే చానా మంది రైతులు బాగుపడుతన్రు. సీఎం సారుకు రుణపడి ఉంటా.-మునిపాల రవి, సైదాపూర్(హుజూరాబాద్)
ప్రపంచంలోనే గొప్ప పథకం
అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడున్నరేండ్ల కిందట రైతుబంధు పథకానికి అంకురార్పణ చేశారు. ఏటా బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించి 66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లకు చేరుతుండగా చారిత్రాత్మకం.. ఇంతటి గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ సందర్భంగా అన్నదాతలు సంతోషంగా సంబురాలు జరుపుకోవాలి.