విద్వేషపూరిత, తప్పుడు పోస్టులు పెట్టొద్దు
ప్రజల మధ్య వైషమ్యాలను పెంచొద్దు
అక్రమ చానళ్ల నిర్వాహకులు, రిపోర్టర్లపై కఠిన చర్యలు
దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు స్పెషల్ టీం
ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఇద్దరిపై కేసు
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎంపీ అరెస్ట్
సీపీ సత్యనారాయణ
రాంనగర్, జనవరి 7 : సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్‌లో మితిమీరొద్దని, ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్‌ల్లో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా అసభ్యకరమైన, అవమానకరమైన, విద్వేషపూరితమైన పోస్టులు పెట్టినా.. సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా చిత్రీకరీంచినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. తప్పుడు పోస్టులు పెట్టి ఆదాయం పొందడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. కొన్ని పొస్టులు వివిధ వర్గాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలను పెంచి ఉద్రిక్తతలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అక్రమ చానెళ్లు నడుపుతూ రిపోర్టర్లుగా చలామణి అవుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వీరిలో ఎంతటి వారున్నా మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఏ న్యూస్ చానల్, ప్రింట్ మీడియా అయినా తగిన అనుమతులు తప్పనిసరి అని, రిపోర్టర్లుగా పని చేసే వారికి అక్రిడిటేషన్కార్డు, సంబంధిత వార్త సంస్థ నుంచి నియామక పత్రం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అక్రమంగా చానళ్లను నడుపుతున్న నిర్వాహకులు, వాటి తరఫున రిపోర్టర్లుగా చెప్పుకుంటున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన యూట్యూబ్ చానెల్ జీఎస్ఆర్ టీవీ తెలుగు యజమాని గుండా శివరామరెడ్డి, చిన్నపాపయ్యపల్లికి చెందిన రైట్వాయిస్ చానల్ నరెడ్ల ప్రవీణ్‌రెడ్డి విలేకరులుగా చెలామణి అవుతూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక కంప్యూటర్, రెండు లోగోలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎవరైనా అక్రిడిటేషన్ కార్డు లేకుండా విలేకరులుగా చలామణి అయితే ఊరుకునేది లేదన్నారు. సోషల్‌మీడియాలో దుష్పప్రచారాలు అరికట్టేందుకు కరీంనగర్ కమీషనరేట్లో ఒక ఎసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక సీఐతోపాటు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎంపీని అరెస్టు చేశాం
కొవిడ్ బారిన ప్రజలు పడకూడదని, పోలీసుల విధులకు ఆటంకం కలగడంతోనే ఎంపీ బండి సంజయ్ కుమార్, వారి అనుచరులను అరెస్టు చేశామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మూడో వేవ్ ముంచుకొస్తున్న ఈ సమయంలో వందలాది మందితో దీక్షకు తాము అనుమతి ఇవ్వలేదని, ఆ మేరకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయినా వారు రోడ్డును బ్లాక్ చేసి పెద్ద పెద్ద టెంట్స్ వేశారని, నోటీసులు, విజ్ఞప్తులు, హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాష్ట్రస్థాయి నాయకులు, వందలాది సంఖ్యలో కేడర్ రావడంతో తాము అప్రమత్తం అయ్యామన్నారు. కొవిడ్ వ్యాప్తిని ఆపడానికి ముందస్తు అరెస్టుకు ప్రయత్నం చేశామన్నారు. కానీ, ఎంపీ బండి సంజయ్ పోలీసుల దృష్టిని మార్చి కారును వదిలి బైక్‌పై అధిక సంఖ్యలో కార్యకర్తలతో ఎంపీ కార్యాలయంలోనికి వెళ్లి దీక్షలో కూర్చుకున్నారని తెలిపారు. అక్కడికి మరింత క్యాడర్ రావాలని చెప్పారని, మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా వందలాది మంది కార్యకర్తలు వస్తుంటే.. వారిని దీక్ష ప్రదేశానికి రాకుండా పోలీసులు పలుసార్లు నిరోధించారని చెప్పారు. అలాగే మాస్కులు లేని వారందరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నిరోధానికి పోలీసుల ప్రయత్నాలకు సహకరించకపోగా విధులకు ఆటంకం కలిగించడం, తిరగబడడడంతో పోలీసులకు గాయాలయ్యాయన్నారు. తాను కూడా పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకపొవడంతో కొవిడ్ నిబంధనలు, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి వేరే మార్గం లేక ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను, వారి అనుచరులను అరెస్టు చేశామని చెప్పారు. పోలీసుల అరెస్టులో ఎక్కడ కూడా ఎంపీ బండి సంజయ్‌కు తలకు గాయం కాలేదన్నారు. ఆయన తలకు దెబ్బ తగలకుండా పలుసార్లు పోలీసులు కాపాడారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ బండి సంజయ్‌కుమారే స్వయంగా చెప్పారన్నారు. ఎంపీ ప్రివిలేజీకి ఎక్కడా భంగం కలిగించలేదన్నారు. హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ దీక్షను చేపట్టినందున అరెస్టు చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.