బుడిగజంగాల కాలనీలో టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడులు
250 క్వింటాళ్లకు పైగా స్వాధీనం
ముకరంపుర, జనవరి7: గుట్టుగా సాగుతున్న రేషన్ బియ్యం దందాను సివిల్ సైప్లె టాస్క్‌ఫోర్స్ బృందం రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం మెరుపు దాడి చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా నగర శివారులోని రేకుర్తి బుడిగజంగాల కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన లక్షలాది రూపాయల విలువైన ప్రజాపంపిణీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నది. జిల్లాలో కొంత కాలంగా రేషను బియ్యం దందా జోరుగా సాగుతుందనే సమాచారంతో సివిల్ సైప్లె శాఖ కమిషనర్ కార్యాలయం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దించింది. బియ్యం దందా సాగుతున్న తీరుపై ఈ బృందాలు పక్కా సమాచారాన్ని సేకరిస్తూనే…జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, తినుబండారాల దుకాణాలు, రేషన్ దుకాణాలతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కరీంనగర్ శివారు రేకుర్తిలోని బుడిగజంగాల కాలనీలో భారీ పీడీఎస్ బియ్యం డంపు ఉందనే విశ్వసనీయ సమాచారంతో వచ్చినట్లు తెలిపారు. చీఫ్ విజిలెన్స్ అధికారి కర్నల్ సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం తహసీల్దార్ కమల్‌పాషా, ఎస్ఐలు పుల్లయ్య, చారి, ఆర్ఐ కమలేష్, కొత్తపల్లి ఠాణా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
గుడిసెలో డంపు..
అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా కాలనీలోని ఓ గుడిసె ఎంపిక చేసుకుని, చుట్టూ కవర్లతో కప్పారు. భారీ ఎత్తున సేకరించిన ప్రజాపంపిణీ బియ్యాన్ని పాలిథీన్ సంచుల్లో నింపి నిల్వ గుడిసెలో దాచి ఉంచారని తనిఖీ బృందం అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ఉన్న బియ్యం బస్తాలను అక్కడి నుంచి తరలించడం ఇబ్బందిగా మారింది. దీంతో హమాలీ కార్మికులతో ఓ లారీ, మరో వాహనంలో బియ్యం బస్తాలను లోడ్ చేయించారు. ఎల్ఎండీలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి స్థానిక సివిల్ సైప్లె అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యం సుమారు 250క్వింటాళ్ల వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు రేషను బియ్యం సేకరిస్తూ రహస్యంగా ఇక్కడ నిల్వ చేసి ఉంటారని అధికారులు పేర్కొన్నారు. అక్రమార్కులు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.26చొప్పున బియ్యం విక్రయిస్తూ అక్రమ దందా నడుపుతున్నట్లు సమాచారం. కాలనీలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వ చేయడం వెనక సూత్రధారులు ఎవరు…? ఈ అక్రమ దందా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.