దీక్షల పేరిట దొంగ నాటకాలు
స్వప్రయోజనాలు తప్ప ఉద్యోగులపై ప్రేమ లేదు
కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు ధ్వజం
కార్పొరేషన్, జనవరి 7: ‘ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు చేసిందేంటో చెప్పు? దీక్షల పేరిట నాటకాలు తప్ప ఒరగబెట్టిందేంటో చెప్పు? ఉద్యోగులను తప్పుదోవ పట్టించేందుకే జాగరణ పేరిట హైడ్రామా చేయడం తప్ప వారి సమస్యల పరిష్కారానికి ఏం చేసినవో చెప్పు?.’ అంటూ కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌లో దీక్ష చేయకుండా కరీంనగర్‌లోనే చేయడంలో మతలబేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. సంజయ్ కేవలం సానుభూతి కోసమే దీక్ష చేశాడు తప్పితే ఉద్యోగులపై ప్రేమతో కాదని విమర్శించారు. వీడియో ఫుటేజీలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఎంపీగా విఫలమైన ఆయన ప్రజల దృష్టిని మరల్చేందుకే జీవో 317పై ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. మూడేండ్లుగా కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదని విమర్శించారు. సంజయ్‌కు దమ్ముంటే చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ మాజీ ఎంపీ కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కోసం తీవ్రంగా ప్రయత్నించాడని..స్థల సేకరణ సైతం చేయించారని తెలిపారు. అయితే ట్రిపుల్ ఐటీ కర్ణాటకకు తరలిపోయినా బండి సంజయ్ చేతులు ముడుచుకుని కూర్చున్నాడని దుయ్యబట్టారు.
అలాగే తీగలగుట్టపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి కోసం వినోద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తే అక్కడ ట్రాఫిక్ లేదనే సాకుతో మంజూరు చేయలేదని కేంద్రాన్ని ఆక్షేపించారు. కానీ తీగలగుట్టపల్లిని కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జికి 80 శాతం నిధులిస్తే ఇది తన ఘనతగా చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని దునుమాడారు. పదవిని కాపాడుకొనేందుకే ఆందోళన పేరిట డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని, ఈ దిశగా జీవో 317లో పలు మార్పులు చేస్తున్నదని చెప్పారు. బండి సంజయ్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మబోరని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణారావు, సుధగోని మాధవికృష్ణగౌడ్, ఐలేందర్‌యాదవ్, గందె మాధవి, బుచ్చిరెడ్డి, యాదయ్య, కో ఆప్షన్ సభ్యుడు అజిత్‌రావు, నాయకులు గంట శ్రీనివాస్, కరీం పాల్గొన్నారు.