వేములవాడ, నవంబర్ 6: వేములవాడ పట్టణ, రాజన్న ఆలయ సమగ్రాభివృద్ధే లక్ష్యమని, అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఉద్ఘాటించారు. వేములవాడ పట్టణాభివృద్ధికి మంజూరైన 20కోట్ల అభివృద్ధి పనుల అనుమతి పత్రాన్ని సంగీత నిలయంలో మున్సిపల్ అధ్యక్షురాలు మాధవి, కౌన్సిలర్లకు అందజేసి మాట్లాడారు. ఈ నిధులతో పట్టణంలో అవసరమైన పనులు చేపడుతామని చెప్పారు. ఆధ్యాత్మిక క్షేత్రం.. వేములవాడ పట్టణం నియోజకవర్గానికి గుండెకాయలాంటివని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ రాజన్న క్షేత్రాన్ని సందర్శించిన 2015 జూన్ 18న పట్టణాభివృద్ధి కోసం పునాది పడిందని గుర్తు చేశారు. గుడిచెరువులో ఎప్పుడూ నీరుండేలా 16కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేసి రాజరాజేశ్వర జలాశయం నింపుతున్నామని చెప్పారు. 90కోట్లతో గుడిచెరువు సుందరీకరణ జరుగుతున్నదని వివరించారు. మరో 20కోట్లతో బండ్ నిర్మాణం జరుగబోతున్నదని స్పష్టం చేశారు. 42కోట్లతో మిషన్ భగీరథ పనులు తుదిదశకు చేరాయని చెప్పారు. మూలవాగు వంతెన నుంచి పోలీస్‌స్టేషన్ దాకా రోడ్ల విస్తరణ జరుగుతున్నదని, రైల్వే లైన్ బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం నిరంతరం కృషిచేస్తున్నామని చెప్పారు.
ఏడాదికి కోటితో ఆలయ అభివృద్ధి, 33కోట్లతో భూగర్భ డ్రైనేజీలు, 20కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, తిప్పాపూర్ బస్టాండ్ బ్యూటిఫికేషన్, 100కోట్లతో నాంపల్లి గుట్ట అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఇలా అనేక కార్యక్రమాలు అంచెలంచెలుగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు 3కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పంట మార్పిడి తప్పనిసరి అని రైతులు ఆలోచించి లాభాల సేద్యాలు చేపట్టాలని సూచించారు. దేశంలో 75వేల కోట్ల పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటున్నామని, మనవద్దే సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చునని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏరియా దవాఖానను అందుబాటులో తీసుకవచ్చామని, త్వరలో సిటీస్కాన్, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పట్టణాభివృద్ధి కోసం సహకరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పట్టణాభివృద్ధి కోసం 20కోట్లు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే రమేశ్‌బాబును సన్మానించారు. ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్ మధురాజేందర్, కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, కౌన్సిలర్లు ఉన్నారు.