జిల్లాలో బతుకమ్మ సంబురాలు ప్రారంభం
పూదోటలైన ముంగిళ్లు
ఆడిపాడిన మహిళలు, యువతులు
రాజన్న సిరిసిల్ల/జగిత్యాల/పెద్దపల్లి, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ);ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూవాడా సందడిగా మారాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి కూడళ్లలో ఉంచి చిన్నాపెద్దా కలిసి ఆడిపాడారు. చుట్టూ తిరుగుతూ కోలాటమాడుతూ నృత్యం చేశారు. ‘రామరామ ఉయ్యాలో’.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో వీధులన్నీ మార్మోగగా అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. సిరిసిల్లలోని మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్ వద్ద, వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. జగిత్యాల, మల్యాల, జగిత్యాల రూరల్, ధర్మపురితో పలు మండలాల్లో మహిళలు సర్కారు అందజేసిన చీరలు ధరించి సంబురంగా బతుకమ్మ ఆడారు.
‘చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుడీ ముద్దుల గుమ్మ..బంగారు బొమ్మ దొరికెనమ్మా ఈ వాడలోన…’ అంటూ బతుకమ్మ వేడుకలకు స్వాగతం పలికారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ బుధవారం ఎంగిలిపూల వేడుకతో ఆరంభమైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, యువతులు వాడలోకి రావడంతో వీధులన్నీ పూల జాతరతో కనువిందు చేశాయి. ఈమేరకు ఉదయం తంగె డు, గునగ, గుమ్మడి, బంతి, సీతమ్మ తదితర తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి మధ్యలో గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించారు. అత్తింటి నుంచి ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకోవడంతో ప్రతి ఇల్లు సందడిగా కనిపించింది. వాడవాడనా బతుకమ్మ వేడుకలతో శోభాయమానం సంతరించుకున్నాయి. అనంతరం రాత్రి బతుకమ్మలను సమీపంలోని ఆలయాలు, చెరువులు, గోదావరి వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.