మంత్రి కేటీఆర్‌ను కలిసిన టీబీజీకేఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు
అమాత్యుడికి వినతిపత్రాలు అందజేత
గోదావరిఖని, ఆగస్టు 6: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను త్వరగా పరిష్కరించాలని టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు ప్రగతి భవన్లో శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రామగుండంలో త్వరలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు 25శాతం సీట్లు కేటాయించాలని, సింగరేణి వ్యాప్తంగా కంపెనీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీరి వెంట కెంగర్ల మల్లయ్య ఉన్నారు. అలాగే టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ను కలిసి విన్నవించారు. కార్మికుల డిపెండెంట్ల వయసు 35 నుంచి 40 ఏండ్లకు పెంచాలని, అలాగే సంస్థలో మారుపేర్లతో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూగర్భ గనుల్లో పని చేస్తూ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు సర్ఫేస్‌లో సుటబుల్ జాబ్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
గోదావరిఖని, ఆగస్టు 6: నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చి మెడికల్ కళాశాలను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు రామగుండం ప్రజలమంతా రుణపడి ఉంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, టీబీజీకేఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా ముందు భాగాన నిలిచి పోరాటం సాగించారన్నారు. సింగరేణి కార్మికులు రామగుండం ప్రాంత ప్రజలు ఆకాంక్ష మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రకటన చేయించామన్నారు. సింగరేణి కార్మికులంటే సీఎంకు అమితమైన అభిమానమన్నారు. సమైక్య పాలనలో సింగరేణి సమస్యలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించారన్నారు. సింగరేణిలో 30 ఏండ్లుగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు ఎలాంటి యాజమాన్య హక్కు లేకుండా పోయిందని, సీఎం కేసీఆర్ సింగరేణి స్థలాల్లోని నివాసాలకు యాజమాన్య హక్కుతోపాటు పట్టాల మంజూరు కోసం జీవో 76 తీసుకువచ్చారని తెలిపారు. రామగుండం ప్రాంతంలో త్వరలో ఏర్పాటు కాబోతున్న మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలని కోరారు.