పండుగ వాతావరణంలో కార్యక్రమాలు
ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు lజగిత్యాల జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల హాజరు
జమ్మికుంట, వీణవంకలో పాల్గొన్న ర్రాష్ట్ర పణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కరీంనగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జోరందుకున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఏ వీధిలో చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది. ఆరో రోజైన మంగళవారం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్‌లో సోమవారం రాత్రి పల్లెనిద్రలో పాల్గొని ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, గ్రామ సభ నిర్వహించారు. రాయికల్ మండలం అల్లీపూర్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి రైతు వేదికను, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
భూపతిపూర్‌లో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్పల్లి పట్టణంలోని 1, 15, 19 వార్డుల్లో పాల్గొని మొక్కలు నాటారు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ జమ్మికుంట పట్టణంతోపాటు వీణవంక మండలం గన్ముక్కుల, బొంతుపల్లి గ్రామాల్లో కలెక్టర్ శశాంకతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గంగాధర మండలం కురిక్యాల, మధురానగర్ గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై మొక్కలు నాటారు. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసి వైకుంఠధామం, 11కేవీఏ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి, అన్నారం, లలితాపూర్, పోచంపల్లి, రంగపేటలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీసు స్టేషన్ ఆవరణలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మొక్కలను నాటారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం సుద్దాల, జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మొక్కలు నాటారు. గంభీరావుపేట మండలం నాగంపేట, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్ పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు.