స్మార్ట్ సిటీలో భాగంగా శరవేగంగా అభివృద్ధి పనులు
మూడు నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు
తొలగనున్న సమస్యలు
కార్పొరేషన్, నవంబర్ 5;ఒకప్పుడు కనీస మౌలిక వసతులు సైతం లేని కరీంనగర్ శివారులోని హౌసింగ్‌బోర్డు కాలనీ నేడు నగరానికే మోడల్ కాలనీగా రూపుదిద్దుకుంటున్నది. ఎటు చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులతో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు ప్రత్యేక చొరవతో సకల సదుపాయాలు సమకూరుతుండడంపై కాలనీవాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
స్మార్ట్‌సిటీ కింద ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి కాలనీలోని ప్రధాన రోడ్లతో పాటు, అన్ని వీధుల్లోనూ సీసీ రోడ్లు, ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. ఇప్పటికే కాలనీలో అత్యధిక రోడ్ల పనులు పూర్తి కాగా, మిగిలినవి కూడా వేగంగా పూర్తి చేసే దిశగా మంత్రి, మేయర్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ కింద మంజూరైన రూ. 53 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు భూగర్భ డ్రైనేజీ పనులు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరించి పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం మేర డ్రైనేజీల నిర్మాణం, 60 శాతం మేర రోడ్ల పనులు కూడా పూర్తయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే విద్యుత్ పోల్స్ మార్చడంతోపాటు భూగర్భ డ్రైనేజీని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇస్తున్నారు.
24 గంటల నీటి సరఫరాకు పైలెట్ ప్రాజెక్టు
రానున్న రోజుల్లో 24 గంటల నీటి సరఫరా కోసం పైలెట్ ప్రాజెక్టు కింద హౌసింగ్ బోర్డు కాలనీలోని రిజర్వాయర్‌ను సైతం ఎంపిక చేశారు. దీంతో ఈ కాలనీలోనే మొదటగా 24 గంటల మంచినీటి సరఫరా అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించి డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. గతంలో ఈ కాలనీకి మంచినీటి పైపులైన్ కూడా లేకపోవడంతో మంత్రి గంగుల కమలాకర్ రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా పైపులైన్ వేయించి అన్ని వీధులకు వేర్వేరుగా పబ్లిక్ నల్లాలను ఏర్పాటు చేయించారు. అలాంటిది రెండేళ్లలోనే కాలనీ రూపురేఖలు మార్చి ఇప్పుడు 24 గంటల మంచినీటి సరఫరా కోసం సైతం ప్రయత్నాలు చేయడం గమనార్హం.
అతి త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి
హౌసింగ్‌బోర్డు కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కాలనీల్లో చేపట్టిన స్మార్ట్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించాం. వీటితో పాటు పార్కులు, ఓపెన్ జిమ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఓపెన్ జిమ్స్‌ను ప్రారంభించగా.. పార్కుల పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటు ముందుకు సాగుతున్నాం. సాధ్యమైనంత వేగంగా ఈ కాలనీలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ కావాల్సిన చర్యలు చేపడుతున్నాం.