ముస్తాబాద్‌లో అమానవీయ ఘటన
శిశువు ఏడుపుతో గుర్తించిన పోలీసులు
ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత
ముస్తాబాద్, నవంబర్ 5: నవమాసాలు మోసి..పురిటి నొప్పులు భరించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..ఏమైందో ఏమో..ఆడపిల్ల భారమనుకున్నదో తెలియదు..నిండు అమాసనాడు ఆడపిల్ల పుట్టడాన్ని అరిష్టమనుకున్నదో.. ఎందుకు వద్దనుకుందో తెలియదు..కారణమేదైనా పేగుబంధం తెంచుకొని పుట్టిన బిడ్డను నడిరోడ్డుపై వదిలేసి అనుబంధాన్ని తెంచుకున్నది ఆ కసాయి తల్లి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఈ అమానవీయ ఘటన జరిగింది..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ముస్తాబాద్ ఠాణా పక్కన గల రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున శిశువు అరుపులు వినిపించాయి. దీంతో పోలీసు సిబ్బంది అటుగా వెళ్లి చూడగా చలికి గజగజ వణుకుతున్న స్థితిలో గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఓ పసిపాప కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్టేషన్ హౌస్ఆఫీసర్కు సమచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని పసికందును ఓ తువ్వాలలో చుట్టి సమీపంలోని పోతుగల్ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి పాప ఆరోగ్యంగా ఉందని గుర్తించారు. శుక్రవారం ఉదయం ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. వారు పీహెచ్‌సీకి చేరుకోగా, వారికి వైద్యసిబ్బంది శిశువును అప్పగించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు పెద్దసంఖ్యలో పోతుగల్ దవాఖానకు చేరుకున్నారు. మహిళలు పసికందును చూసి కంటతడిపెట్టారు. పలువురు తమకు అప్పగిస్తే సాదుకుంటామని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులను వేడుకున్నారు. కాగా, పాపను గుర్తించి చేరదీసిన పోలీసు సిబ్బంది, ఎస్ఐ వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజీవరెడ్డిని స్థానికులు అభినందించారు.